సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరారీలో ఉన్నారని పోలీసులు మీడియాకు లీక్ ఇచ్చారు. నిజానికి బాల్క సుమన్ ను పట్టుకోవాలంటే తెలంగాణ పోలీసులకు పది నిమిషాల పని. ఆయన ఎక్కడ ఉంటారో ట్రాక్ చేయలేనంత దీన స్థితిలో తెలంగాణ పోలీులు లేరు. కానీ పట్టుకోరు. బయట కనిపిస్తే పట్టుకుంటామని లీకులు మాత్రం ఇస్తూంటారు. నిజంగానే బయట కనిపిస్తే పోలీసులు పట్టుకుంటారేమోనని బాల్క సుమన్ బయట కనిపించకుండా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు మాత్రం వెదకడం లేదు. పోలీసులకు కనిపించకుండా ాయన దాక్కుంటున్నారు.
ఇదే అదనుగా ఆయన పరారీలో ఉన్నారని.. ఏ క్షణమైనా అరెస్టు చేస్తామని పోలీసులు లీకులు ఇస్తున్నారు. ఈ కారణంగా బాల్క సుమన్ బయటకు రాలేకపోతున్నారు. బాల్క సుమన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో పెద్ద పల్లి ఎంపీగా పోటీ చేశారు. మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు టిక్కెట్ కోసం అతి విధేయత ప్రదర్సించాలనుకుని రేవంత్ రెడ్డిపై చెప్పు భాష ప్రయోగించారని అంటున్నారు. కానీ అది వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
పెద్దపల్లి ఎంపీ సీటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బాల్క సుమన్ కు అదీ దొరికే చాన్స్ లేదు. ఆ ఆరెస్ట్ ఏదో పోలీసుల్ని చేయించుకోనిచ్చి.. బెయిల్ పై బయటకు వస్తే పోలా అని ఆయన అనుచరులు అనుకుంటున్నారు. కానీ పాత కేసులు బయటకు తీసుకొస్తే తమ పరిస్థితేమిటని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది .