మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నర్సాపురం అల్లుడు కాబోతున్నారు. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి , అమ్మాణి దంపతుల చిన్న కుమార్తె పుష్పవల్లి తో వంగవీటి రాధా వివాహం ఖరారైంది. పుష్పవల్లి తల్లి జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. వధువ తండ్రి టీడీపీ లో సుదీర్ఘ కాలం కీలక నేతగా వ్యవహరించారు. మధ్యలో రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తిరిగి వచ్చి నర్సాపురంలోనే ఉంటున్నారు.
కొంత కాలం క్రితం జనసేనలో చేరారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయ్యారు. గత నెలలో పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లొ వారాహి యాత్ర సమయంలో నర్సాపురంలో ఉన్న సమయంలో వీరి ఇంటిలోనే బస చేసారు. ఆ సమయంలో తమ కుమార్తె వివాహం విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. వంగవీటి రంగా జయంతి సమయంలోనూ రాధా వీరి ఇంటికి వచ్చారు. నర్సాపురంలో జరిగిన రంగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో రెండు వైపులా వివాహ సంబంధం గురించి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నర్సాపురానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం వంగవీటి రాధా వివాహం ఖరారు సమయంలో మధ్యవర్తిత్వం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆరో తేదీన సింపుల్‌గా పెళ్లి వేడుకను నిర్వహించే అవకాశం ఉంది.