కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ ఓడిపోతోంది. అయినా ప్రగల్భాలు పలకడం మానుకోలేదు. చింత చచ్చినా పులుపు చావలేదంటే బహుశః ఇదేనేమో. నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు భరోసా యాత్రలో మాజీ కేంద్రమంత్రి పి. బలరామ్ నాయక మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు తెరాసకు ఓటు వేసి గెలిపించారు. సుదీర్గ పోరాటాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకొన్న తెలంగాణాని అపహాస్యం చేసారు. వరంగల్ ఉప ఎన్నికలలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే తెలంగాణాని మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తాం. నేనన్న దానిలో తప్పేముంది?” అని ప్రశ్నించారు. ఆయన పక్కనే వేదిక మీద ఉన్న టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలి తదితరులు అందరూ బలరామ్ నాయక్ అన్న మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వారు.
ఆయన ఆవిధంగా మాట్లాడటం చూస్తుంటే తెలంగాణా ప్రజలను బెదిరించినట్లు పైకి కనబడుతున్నప్పటికీ, తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు తమ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే ఆక్రోశం స్పష్టంగా కనబడుతోంది. అయితే అధికారంలోలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఆంద్రప్రదేశ్ లో ఏవిధంగా కలపగలదు? అని ఆయన ఆలోచించలేదు. అయన అన్న ఆ మాటని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న తెరాస నేతలు కూడా ఆ విషయం పట్టించుకోలేదు.
తెరాస నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి బలరామ్ నాయక్ మాటలు అద్దం పడుతున్నాయన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం, ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బలరామ్ నాయక్ కించపరిచేలా మాట్లాడారు. అయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగానే భావించాల్సి ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ బేషరతుగా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి,” అని ఆయన డిమాండ్ చేసారు.
సుదీర్గ పోరాటాలు, అనేక మంది బలిదానాల వలననే తెలంగాణా ఏర్పడిందనే మాట వాస్తవం. కానీ వారి పోరాటాలకు, బలిదానాలకు ఫలలాలను ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఏనాడూ తెలంగాణా ఉద్యమంలో పాల్గొనని కడియం, తుమ్మల, తలసాని వంటి వారు తెలంగాణాని పరిపాలిస్తుంటే, తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నవారి కుటుంబాలలో చాలా మంది కనీసం ప్రభుత్వ గుర్తింపుకి కూడా నోచుకోలేదు. మరి బలరామ్ నాయక్ మాట్లాడిన మాటల కంటే ఇది ఏమయినా న్యాయంగా ఉందా? అని తెరాస నేతలు ఆలోచించాలి.