ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడని రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపైనే అట్రాసిటి కేసులు పెట్టిన ఏపీ సీఐడీ అధికారులను ఎలాగైనా కోర్టుకు లాగాలన్న లక్ష్యంతో మాజీ ఎంపీ హర్షకుమార్ ఉన్నారు. ఏ జీవోను తప్పు అని చెప్పి సీఐడీ అధికారులు చెప్పారో.. ఆ జీవోను ఆదారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున దళితుల భూములను లాక్కుంది. ఇళ్ల స్థలాల పేరిట పంపిణీ చేసింది. ఆ జీవోను తప్పుగా చూపించి.. కేసులు పెట్టడంతో.. అదే జీవోను చూపించి పేద దళితుల భూములు లాక్కున్నందున.. ప్రస్తుత ప్రభుత్వంపైనా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సమగ్రమైన వివరాలతో ఆయన సీఐడీకి ఫిర్యాదు లేఖ పంపారు.
పేదలకు ఇళ్ల పేరుతో దళితుల నుంచి ప్రభుత్వం అసైన్డ్ భూములు లాక్కుందని… ఆధారాలతో సహా సీఐడీకి లేఖ పంపానని హర్షకుమార్ ప్రకటించారు. సీఐడీ నమోదు చేసిన కేసుల ప్రకారం.. తాను ఇచ్చిన ఫిర్యాదును చూసి.. జగన్, బొత్స, ధర్మాన కృష్ణదాస్‌పై కేసులు పెట్టాలని.. నోటీసులు పంపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని భూముల విషయంలో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. దళిత రైతులందరూ తాము స్వచ్చందంగా భూములు రాజధానికి ఇచ్చామని ప్రకటించారు. అయితే ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాలు అలాంటివి కావు.
ప్రభుత్వ భయంతో ఫిర్యాదులు చేయరేమో కానీ.. వారికి ధైర్యం కలిగిస్తే అసైన్డ్ రైతులందరూ.. ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో చాలా మంది దళితులు ఆత్మహత్యాయత్నాలు చేశారు. కొంత మంది చనిపోయారు కూడా. ఇప్పుడు హర్షకుమార్ .. తన ఫిర్యాదుపై స్పందించకపోతే.. కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.