జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఆయన చాలా రోజుల కిందటే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు. పధ్నాలుగో తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన పవన్ సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మంగళగిరి జనసేన ఆఫీసులో పవన్ ను కలిశారు. చేరేందుకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.
పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంకు పంపి పవన్ కల్యాణ్ పై పోటీ చేయించారు. ఇలా ఖరారు చేసే ముందు దొరబాబుకు కనీస సమాచారం ఇవ్వలేదు. అయితే ఆయన వైసీపీలోనే ఉన్నారు. వంగా గీత విజయం కోసం పని చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా .. పవన్ కల్యాణ్ మెజార్టీని 70వేలకు తగ్గించలేకపోయారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన విమర్శల కారణంగా ఇక ప్రజలమద్దతు లభించడం కష్టమని తేలిపోవడంతో ఆయన జనసేన పార్టీ వైపు చూశారు.
ఇప్పటికే పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ జనసేన పార్టీలో జాయిన్ అయింది. వైసీపీకి స్థానిక నాయకత్వం లేకుండా పోయింది. వంగా గీత ఎప్పుడో ఓ సారి నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ పిఠాపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. దీంతో జనసేన పార్టీలో చేరిపోవడమే మంచిదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.