భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కన్ను మూశారు. 2009లో స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై, మాట క్షీణించింది. వీల్ చైర్ కు పరిమితమై, మనుషులను గుర్తించలేని స్థితికి చేరారు. ఆయన దీర్ఘకాలిక మధుమేహంతో పాటు డిమెంటియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఏ బహిరంగ సమావేశంలోనూ హాజరుకావడం లేదు. మోడీ ప్రధాని అయ్యాక భారత రత్న ప్రకటించారు. ఆరు ఏళ్లు ప్రధాని గా బాధ్యతలు నిర్వహించారు. భారత రాజకీయాలలో విలక్షణమైన నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి. తనని గొప్ప నాయకుడిగా చేసిన పార్టీకన్నా, తాను చేపట్టిన పదవులకన్నా ఎక్కువగా ఎదిగి, విశేషమైన ప్రజాభిమానం సంపాదించుకున్న నేత. సమ్మోహనపరిచే ప్రసంగాలతో, భావోద్వేగాలతో కూడిన కవితలతో, అలుపెరుగని రాజకీయ పోరాటాలతో, రాజకీయాలతో – సైద్ధాంతిక విభేదాలతో సంబంధం లేకుండా తనకు ఒక ప్రత్యేకతను, అభిమానాన్ని, గౌరవప్రదమైన స్థానాన్ని ప్రజా జీవనంలో సంపాదించుకున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య, రాజకీయ కార్యక్రమాలలో మునిగితేలే ఆయన వ్యక్తిగతంగా తనదైన ఒక జీవితాన్ని, అలవాట్లను ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన నేత.
ఒక ఉదారవాద నాయకుడిగా, సిద్ధాంతాల పట్ల అంతగా కట్టుబాట్లు లేకుండా అందరితో చేతులు కలిపి వారి మన్ననలు పొందగల ఆమోదయోగ్యం గల అరమరికలు లేని నేతగా ఆయన గురించి తెలుసు. అయితే చాలా లోతైన మనిషి అని, తన మనసులో ఉద్వేగాలను, వ్యక్తుల పట్ల గల కచ్చితమైన అభిప్రాయాలుగల నాయకుడే కాకుండా సొంత పార్టీలోనే అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ రాజకీయ ప్రయాణం చేశారు.
ఆర్ఎస్ఎస్కు, వాజపేయిల మధ్య నెలకొన్న పరస్పర ‘అపనమ్మకం’ ప్రభుత్వ నిర్వహణలోనే కాక బిజెపి ఎదుగుదలలో సహితం తరచూ ఎన్నో ప్రతిబంధకాలు కలిగించేది. ఒక విధంగా లక్షలాది మంది ప్రజలను తన ప్రసంగాలతో ఆకర్షించగల వాజపేయి రాజకీయ జీవితంలో చివరి దశాబ్దాలలో ఒంటరిగా మిగిలిపోయారా అనే అనుమానాలు కలుగక మానదు. ఇతర నాయకుల వలే భజనపరులను, వ్యక్తిత్వం లేని వారిని కాకుండా వీలయినంత వరకు సమర్థులను చేరదీసి, వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడం వాజపేయిలో కనిపిస్తుంది. వారిలో చాలామంది సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్, బిజెపి భావాలను ఆమోదించకపోవచ్చు. కానీ దేశం పట్ల, ప్రజల పట్ల, తాము చేసే పని పట్ల వారికి గల అంకిత భావానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. జస్వంత్ సింగ్, హెచ్.కె.దువా, బ్రిజేష్ మిశ్రా వంటి వారి నియామకాలను ఈ సందర్భంగా గమనించవచ్చు.
బహుశా స్వతంత్ర భారతదేశంలో మంత్రివర్గ సమావేశాలలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పనిచ్చే అవకాశం కలిగింది వాజపేయి మాత్రమే అని చెప్పవచ్చు. అంతకు ముందు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో సహితం తప్పనిసరి పరిస్థితులలో అటువంటి పరిస్థితులు ఉన్నా, అవే జనతా ప్రభుత్వ పతనానికి దారితీశాయి. కానీ వాజపేయి ప్రభుత్వ పటిష్టతకు అనేక మంది మంత్రులు పలు అంశాలపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పనీయడానికి దోహదపడింది.
ఇప్పుడు, కేంద్ర, రాష్ట్రాలలో అధినేతలను పొగడ్తలతో ముంచెత్తడం మినహా నిష్పక్షపాతంగా ఒక అంశంపై తమ అభిప్రాయాలను మంత్రులు ధైర్యంగా చెప్పగల పరిస్థితులు లేవు గదా. స్వతంత్ర భారతంలో అతి పెద్ద సంకీర్ణం నడిపినా ఎన్నడూ తన రాజకీయ అజెండాను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయలేదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఎదురైనా, ఎవ్వరో ఒకరు ఇబ్బందులు కలుగజేసే ప్రయత్నం చేసినా ఎంతో నిబ్బరంతో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఇదంతా ఆయనలోని రాజకీయ చాణుక్యతకు నిదర్శనంగా మిగులుతుంది. మొదటి నుండి జవహర్లాల్ నెహ్రూ మార్గంలో వాజపేయి నడుస్తున్నాడని ప్రతీతి. ఆర్ఎస్ఎస్కు నెహ్రూ పేరు చెబితేనే చిరాకు. మదన్‌లాల్ ఖురానా, కళ్యాణ్‌సింగ్, శంకర్ సింగ్ వాఘేలా వంటి బిజెపిలో తొలితరం ప్రజాబలం గల నాయకులను రాజకీయంగా తెర మరుగయ్యేటట్లు చేయడం ఇటీవల చరిత్ర. ఆ తరువాత ఉమాభారతి, ఏడ్డ్యూరప్ప వంటి వారిని ఏ విధంగా అప్రతిష్ఠకు గురిచేసే ప్రయత్నం జరిగిందో చూశాం. పార్టీలో ప్రజాబలం గల నాయకత్వం లేకుండా, భజనపరులను అందలం ఎక్కించడంతో ఎన్నో అనర్థాలకు గురికావలసి వచ్చింది.
పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచడంలో వాజపేయి ప్రదర్శించిన అమోఘమైన రాజనీతిజ్ఞత, చొరవ ఈ సందర్భంగా ప్రశంసించదగినది. గ్రామాలు, రైతులకు మేలుచేసే పలు పథకాలు, కార్యక్రమాలను ఆయన హయాంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి నుండి జనసంఘ్‌కు గల సంప్రదాయ బలాన్ని మించి బిజెపిని విస్తరింపజేయడం కోసం వాజపేయి ప్రయత్నాలు చేశారు. జనతాపార్టీకి లభించిన పార్టీలకు అతీతమైన మద్దతును బిజెపికి లభించేటట్లు చేయాలనీ ఆరాట పడ్డారు.
అదే ఉద్దేశంతో గాంధేయ సామ్యవాదం ప్రతిపాదించి విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో కాన్షీరాంతో కలిసి బిజెపికి మద్దతుతో బిఎస్పి మాయావతి ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. బంగారు లక్ష్మణ్‌ను బిజెపి అధ్యక్షుడిగా చేయడం ద్వారా దళిత వర్గాలలో విశేషమైన ప్రభావం చూపారు.
అయితే చేస్తున్న ప్రయత్నాలు తమ రాజకీయ ఎదుగుదలకు ప్రతిబంధకాలు కాగలవని బిజెపిలో చాలామంది నాయకులు భయపడ్డారు. అందుకనే మాయావతితో సంబంధాలు బెడిసికొట్టాయి. దళిత్ వర్గాలలో విశేష ఆధారం పొందుతున్న బంగారు లక్ష్మణ్ రాజకీయ జీవితాన్ని కాటేశారు. ఇటువంటి పలు సందర్భాలలో వాజపేయి ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది. చివరికి బిజెపి కి ఒక రూపు తెచ్చిన నేత కు ఇప్పుడు కొత్త ప్రధాన కార్యాలయం లో ఫోటోలు పెట్టే దిక్కు కూడా లేదు.