ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేతల్లో వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే వాళ్ళలో సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఒకరు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత దూకుడుగా వ్యవహరించినా నాదెండ్ల మనోహర్ ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా వ్యవహరిస్తూ తన గౌరవాన్ని నిలబెట్టుకొన్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమయిన అనేకమంది కాంగ్రెస్ నేతలలో నాదెండ్ల మనోహర్ కూడా ఒకరు. ఎన్నికల తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా మసులుతుండటంతో ఇంత వరకు ఆయన పేరు కూడా వినబడలేదు. కానీ ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లయితే తన రాజకీయ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందనే ఆలోచనతో నాదెండ్ల మనోహర్ త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి, వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల దసరా పండుగ రోజున ఆయన తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరవచ్చునని తాజా సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి ఆకర్షించి వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేప్పట్టకుండా, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు చొరవ తీసుకోకపోవడం వలన కాంగ్రెస్ నేతలు బీజేపీ పట్ల నమ్మకం లేకనే వైకాపాలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే వచ్చే ఎన్నికల నాటికి వైకాపా మరింత బలపడుతుంది. అప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం మాట అటుంచి తప్పనిసరిగా తెదేపాతోనే కొనసాగవలసి ఉంటుంది.