ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ ఎదుటకు వెళ్లేందుకు ఏ 2, ఏ 3 నిందితులుగా ఉన్న అధికారులు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి కూడా సిద్దంగా లేరు. గురువారం రెడ్డి, శుక్రవారం అర్వింద్ కుమార్ హాజరు కాాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తాము హాజరు కాలేమని సంక్రాంతి తర్వాత ఆలోచిస్తామని లేఖ పంపారు. అయితే మొదటి సారి గడువు అడిగారు కాబట్టి ఈడీ వారం రోజుల సమయం ఇచ్చింది. ఏడు, ఎనిమిది తేదీల్లో ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని తాజా నోటీసులు జారీ చేసింది.
ఏడో తేదీన మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అధికారులే గడువు అడిగినందున కేటీఆర్ కూడా హాజరయ్యే అవకాశం లేదని తనకూ సమయం కావాలని ఆయన లాయర్ల సలహాలతో లేఖలు రాసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆయనకు కూడా ఈడీ మరో వారం గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు తీర్పు రావడానికి ఈ సమయం సరిపోతుందని కేటీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తనపై ఏసీబీ కేసు చెల్లదని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.దానిపై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు వాయిదా పడింది.
అయితే ఈడీ కేసు వేరు. కానీ ఏసీబీ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు పెట్టింది. అసలు చెల్లని .. కోర్టు కొట్టేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు పెడితే ఎలా చెల్లుతుందని కేటీఆర్ లీగల్ టీం వాదించడానికి అవకాసం ఉంటుంది. అందుకే తొందరపడి ఈడీ విచారణకు హాజరవడం కన్నా హైకోర్టు తీర్పు వచ్చే వరకూ డుమ్మా కొట్టడం మంచిదని అనుకుంటున్నారు. అయితే ఈడీ ఒకటికి, రెండు సార్లు చూస్తూందేమో కానీ తర్వాత మాత్రం రాత్రికి రాత్రి వచ్చి అరెస్టు చేసినా ఆశ్చర్యం ఉండదని కవిత అరెస్టు ఉదంతం అప్పుడు క్లారిటీ వచ్చింది.