ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో హ్యాండిచ్చిన మోడీ ప్రభుత్వం ఆ కారణంగా ప్రజాగ్రహానికి గురి కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం అమరావతి చుట్టూ 186కిమీ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో బాటే అనంతపురం, కర్నూలు, ఆత్మకూరు, నందికోట్కూరు, డోర్నాల, నరసరావుపేట మీదుగా రాజధాని అమరావతి వరకు 452 కిమీ రోడ్డు నిర్మాణం, కడప నుండి కర్నూలు మీదుగా అనంతపురం వరకు 132 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.1000 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 44వ 65వ నెంబర్ జాతీయ రహదారులను కలుపుతారు. నిర్మాణం మొదలుపెట్టేక మరో రూ.1000 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర రోడ్లు ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారి ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలియజేసారు. ఈ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి సమగ్ర నివేదిక పంపగానే తక్షణమే శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలియజేసారు.
కేంద్రప్రభుత్వం అనంతపురానికి మరో భారీ ప్రాజెక్టు కూడా మంజూరు చేసింది. అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో పాలసముద్రం వద్ద భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అనే జాతీయ సంస్థకు ఈరోజు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేసారు. సుమారు రూ. 2-3,000 కోట్ల వ్యయంతో 195 ఎకరాలలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పబోతున్నారు. రాష్ట్రంలో అన్నిటి కంటే వెనుకబడిన, కరువు పీడిత అనంతపురం జిల్లాలో ఇంత భారీ పరిశ్రమ రావడం వలన జిల్లా ముఖచిత్రం మారిపోవచ్చును. ఎందుకంటే దీనికి అనుబంధ పరిశ్రమలు అనేకం అక్కడికి తరలి వస్తాయి. వాటి వలన ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. బెల్ ఒక్కటే కాకుండా జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను, వాటి పరికరాలను తయారు చేసే పరిశ్రమలను స్థాపించబోతున్నారు.