హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కలల ప్రాజెక్ట్ ఎల్లుండి శ్రీకారం చుట్టుకోబోతోంది. అన్ని పోలీస్ కార్యాలయాలనూ సకల సదుపాయాలు, అధునాతన వ్యవస్థలతో సహా ఒకే గూటికి చేర్చాలన్న కేసీఆర్ ఆలోచన వాస్తవరూపు దాల్చబోతోంది. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో 24 అంతస్తులతో నిర్మించే ఈ జంట ఆకాశహర్మ్యాలకు ఎల్లుండి ఉదయం ఉదయం 9.50 గంటలకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
నగరంలో చీమ కదిలినా తెలిసిపోయే స్థాయిలో నేరగాళ్ళను, అసాంఘిక శక్తులను లక్ష కళ్ళతో గమనించేందుకు, అనునిత్యం శాంతిభద్రతలను పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల మౌలిక సదుపాయాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)కు అంకురార్పణ జరగబోతోంది. నగర పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక్కచోట కేంద్రీకృతమై అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరాన్ని 24 గంటలూ కాపలా కాసే అద్భుత కేంద్రమని చెబుతున్నారు. దేశంలో ఇంతపెద్ద పోలీస్ కార్యాలయం మరెక్కడా లేదని, విదేశాలలో న్యూయార్క్, సింగపూర్, దుబాయ్‌లలో మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ట్రాఫిక్, నేర నియంత్రణ, నిఘావంటి పోలీస్ బాధ్యతలు నెరవేరుస్తూనే ఆర్టీయే, జీహెచ్ఎంసీవంటి సంస్థలకూ సేవలు అందిస్తూ, నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు ఈ ట్విన్ టవర్స్ ఉపయోగపడతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు అంతస్తులలో ఒకటి 24 అంతస్తులు, రెండవది 17 అంతస్తులతో నిర్మితమవుతుంది. దీని నిర్మాణానికి రు.300 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. నగరవ్యాప్తంగా లక్ష సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల్లో ఒకే చోటనుంచి ఆ లక్ష సీసీ కెమేరాలద్వారా పరిస్థితులను చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఈ కమాండ్ సెంటర్లో ఏర్పాటు చేస్తారు. కేసీఆర్ సూచనల మేరకు పూర్తిగా వాస్తు ప్రకారం డిజైన్ చేసిన ప్లాన్‌తో నైరుతి దిశగా 24 అంతస్తుల భవనం, ఈశాన్యదిశలో 17 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. 24 అంతస్తుల భవనం రూఫ్ టాప్‌పైన హెలిప్యాడ్‌తోపాటు రెండు టవర్లకు సోలార్ ప్యానెల్స్ అమరుస్తారు. భవనమంతా పూర్తిగా ధృడమైన అద్దాలతో నిర్మిస్తారు. 18వ అంతస్తులో పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఈ టవర్స్ నిర్మాణానికి నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి డీపీఆర్ సిద్ధం చేశారు. ఎవరో ఒక బిగ్ బ్రదర్ పైనుంచి మనల్ని కనిపెడుతున్నాడన్న భావన పౌరుల్లో కలిగితే తప్పుచేసేవారిసంఖ్యం సహజంగానే తగ్గిపోతుందని, అటువంటి బాధ్యతాయుత సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో హైదరాబాద్ నగరానికి మూడోకన్నుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కాపలా కాస్తుందని పోలీస్ బాసులు చెబుతున్నారు. రాష్ట్రానికే ల్యాండ్ మార్క్ అయ్యేలా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరగాలని కేసీఆర్ నిర్దేశించారు.