విజయవాడ వాసుల చిరకాల స్వప్నం నిజం కాబోతోంది. ఇంద్రకీలాద్రి దిగువన నగరంలోకి ప్రవేశించడానికి ఉన్న ఇరుకు రోడ్డు స్థానంలో విశాలమయిన ఆరు వరుసలతో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగబోతోంది. ఈ కనకదుర్గ గుడి ఫ్లై ఓవర్ కి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ డిశంబర్ 5న ఉదయం 9గంటలకి శంఖు స్థాపన చేయబోతున్నారు. ఆయనతో బాటు కేంద్ర మం త్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.464 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. దానిలో కేంద్రప్రభుత్వం తన వాటాగా రూ.350 మంజూరు చేసింది. మిగిలిన రూ.114 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ని వచ్చే ఏడాది కృష్ణా పుష్కారాలలోగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ నిర్మించబోయే స్థలంలో ఉన్న నివాస, వాణిజ్య సముదాయాలను తొలగించడం మొదలుపెట్టారు. డిశంబర్ 5న శంఖుస్థాపన జరిగిన వెంటనే వీలయినంత త్వరగా పనులు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే నగరంలోకి ప్రవేశించే, బయటకు వెళ్ళే వాహనాలు దుర్గ గుడి వద్ద గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొనే సమస్య ఉండదు.