రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఒక ఘట్టం ముగిసింది. ఇక ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు వంతు మిగిలింది. పార్లమెంటు సభ్యులకే పరిమితం గనక ఆయన ఎలాగూ గెలుస్తారు. అయితే కోవింద్‌ను బలపర్చిన కొన్ని పార్టీలు ఈయనకు మద్దతివ్వకపోవడం విశేషం. కాంగ్రెస్ గనక గోపాలకృష్ణగాంధీని రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పుకుని వుంటే మరిన్ని పార్టీలు బలపర్చేవని దీన్నిబట్టి తెలుస్తుంది. 35 శాతం మంది ఇప్పటికీ మీరా కుమార్‌కు మద్దతిచ్చారంటే దేశంలో బిజెపియేతర పార్టీల బలం తెలుస్తుంది.టిఆర్ఎస్ వైసీపీ జెడియు బిజెడి వంటివి గనక బలపర్చకపోతే కోవింద్ హౌరాహౌరీగా పోరాడవలసి వచ్చేది.ఏమైనా అది ముగిసిన అధ్యాయం. వెంకయ్య ఎన్నిక కూడా అయిపోతే దేశంలో కీలకమైన నాలుగురాజ్యాంగ పదవుల్లోనూ బిజెపి వారే వుంటారు. పూర్తి మెజార్టి గల ప్రధానిగా మోడీ, లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, రాష్ట్రపతిగా కోవింద్, ఉప పదవిలో వెంకయ్య అన్నమాట. ఇలాటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం. కాంగ్రెస్ అప్రతిహతంగా ఏలిన రోజుల్లో కూడా సర్వేపల్లి రాధాకృస్ణన్, జాకీర్ హుస్సేన్, కృష్ణకాంత్ వంటి వారు ఈ పదవులు నిర్వహించారు. వాజ్‌పేయి హయాంలో అబ్దుల్ కలాం కూడా అలాగే వచ్చారు. తర్వాత నారాయణన్, ప్రతిభాపాటిల్ విస్త్రత ఏకాభిప్రాయంతో ఎన్నికైనారు. గత పదేళ్లుగా ఉపరాష్ట్రపతిగా అన్సారీ కూడా అలాగే కొనసాగారు. అయితే మొదటిసారి మెజార్టి తెచ్చుకున్న బిజెపి అలాటి అవకాశాలేమీ వదులుకోదల్చలేదు గనకే ఆరెస్సెస్ సూచన మేరకు నాలుగు రాజ్యాంగ స్తంభాలు తమవారికే దక్కాలని నిర్ణయించుకుంది. వెంకయ్య విషయంలోనూ అంతగా గమనించని వాస్తవమేమంటే ఏదైనా ఆపద్ధర్మ పరిస్థితి వస్తే ఆయన రాష్ట్రపతి బాధ్యతలు కూడా చేపట్టవలసి వుంటుంది. గతంలో బిడిజట్టి, జకీర్ హుస్సేన్ లాటి వారు ఆ పనిచేశారు కూడా.