అమెరికాలో గన్ సంస్కృతి గురించి గుర్తు చేస్తూ ఎక్కడో అక్కడ కాల్పులు జరగడం, దానిలో అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం గురించి తరచు వార్తలు వింటూనే ఉంటాము. మళ్ళీ అటువంటి వార్త గురించి ఇప్పుడు మరోసారి చెప్పుకోవలసి వస్తోంది.
కాన్సాస్ సమీపంలోని హేస్టన్ అనే చిన్న పట్టణంలో గల ఎక్సెల్ ఇండస్ట్రీస్ అనే సంస్థలో పనిచేసిన సెడ్రిక్ ఫోర్డ్ అనే మాజీ ఉద్యోగి ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు. అతను గురువారం ఉదయం ఏకే-47 మెషన్ గన్ తీసుకొని ఆ కర్మాగారం వద్దకు వచ్చి ఆవరణలో ఉన్న ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. ఆ తరువాత లోపలకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ కాల్పులలో కనీసం 30మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు హార్వే కంట్రీ షరీఫ్ టి. వాల్టన్ తెలిపారు. ఈ సంగతి తెలియగానే అక్కడికి చేరుకొన్న పోలీసులు, సెడ్రిక్ ఫోర్డ్ ని కాల్చి చంపారు.
అమెరికాలో ఈ వికృత గన్ సంస్కృతి వలన ఏటా కనీసం 25-30,000 మంది పౌరులు మరణిస్తున్నారు. కనుక దానిని అరికట్టేందుకు చట్టసవరణలు చేయాలని ఒబామా ప్రభుత్వం ప్రయత్నించింది కానీ దానికి ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవడంతో వెనకడుగు వేయవలసి వచ్చింది. ప్రభుత్వంతో యొక్క ఈ నిస్సహాయత కారణంగానే తరచూ ఇటువంటి వార్తలు వినవలసివస్తోంది. అది అమెరికా స్వయంకృతాపరాధమే కనుక దానికి ఎవరినీ నిందించలేము.