ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు… ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు. ఇదో పెద్ద ప్రక్రియ కావడంతో ప్రతీ సారి చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. కానీ ఈ సారి ప్రభుత్వం వైపు నుంచి అనేక గందరగోళాలు సృష్టిచినప్పటికీ ఉద్యోగాలు పట్టుబట్టి.. అన్ని అవరోధాలను అధిగమించి పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు.
గత ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలకు కలిపి దాదాపుగా లక్షన్నర వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. కానీ ఈ సారి వాటి సంఖ్య నాలుగున్నర లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తీసుకున్నారు. వీరిలో 90 శాతానికిపైగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఉద్యోగులు ఓటింగ్ పై ఇంత ఆసక్తి వ్యక్తం చేయడం .. రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమయింది.
జగన్ మోహన్ రెడ్డి పై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్నది ఆ పార్టీ నేతలకూ తెలుసు. చాలా సార్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెప్పుకున్నారు. కోపం వద్దని మళ్లీ వస్తే మంచి చేస్తామని బతిమాలుకున్నారు. వారి బతిమలాటలు ఫలించి.. వాళ్లకు వెల్లువలా ఓట్లేస్తున్నారా.. అయిదేళ్ల టార్చర్ ను గుర్తు కు తెచ్చుకుని మరోసారి దరిద్రాన్ని నెత్తిన పెట్టుకునేందుకు సిద్ధంగా లేమని అనుకుంటున్నారా అన్నది కౌంటింగ్ అప్పుడు తేలుతుంది.