దేశంలో స్టింగ్ ఆపరేషన్స్ ఎన్ని బయటపడుతున్నప్పటికీ దేనిదారి దానిదే అన్నట్లుగా ఎమ్మెల్యేలు, ఎంపిలు, చివరికి ముఖ్యమంత్రులు కూడా లంచాలు ఇచ్చి పుచ్చుకొంటూనే ఉన్నారు. దొరికినవాళ్ళు దొరికిపోతున్నారు. దొరకని వాళ్ళు దొరల్లాగ తిరుగుతూనే ఉన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసు తరువాత రెండు నెలల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా కర్ణాటకలో నలుగురు ఎమ్మెల్యేలు స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. ఆ వ్యవహారంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య పేరు పైకి వచ్చింది.
ఈ నెల 11న జరుగబోయే రాజ్యసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కర్నాటక కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండేజ్ లకు రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. కానీ తగినంత బలం లేకపోయినా మూడవ అభ్యర్ధి కోసం ప్రయత్నించడం వలన మొదటికే మోసం వచ్చింది. మూడవ అభ్యర్ధిగా మాజీ ఐ.పి.ఎస్.అధికారి శ్రీరామమూర్తిని నిలబెట్టింది. కానీ ఆయనని గెలిపించుకొనేందుకు 12 సీట్లు తక్కువయ్యాయి. వాటి కోసం జెడి.ఎస్., కె.జె.పి.పార్టీ, ఒక స్వంతత్ర ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి ద్దరామయ్య తరపున బేరసారాలు జరుగుతున్నట్లు టైమ్స్ నౌ అనే న్యూస్ చానల్ గుర్తించింది. తక్షణమే రంగంలోకి దిగి స్టింగ్ ఆపరేషన్ చేసి దానిని బయటపెట్టింది.
పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరూ 5 కోట్లు డిమాండ్ చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే రూ.7 కోట్లు కావాలని అడిగారు. దానితో పాటు తన నియోజక వర్గం అభివృద్ధికి రూ.100 కోట్లు, కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరు కూడా పైకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం కంగు తింది. తక్షణమే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఎన్నికలకు ముందే ఈ విషయం బయటకి పొక్కినందున కర్ణాటకలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది.