ఏపిలో ప్రస్తుతం విశాఖ, తిరుపతి, పుట్టపర్తి పట్టాణాభివృద్ధి సంస్థలున్నాయి. ఈ మధ్యనే మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసారు. అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అభివృద్ధి కోసం సి.ఆర్.డి.ఏ. ఏర్పాటు అయింది. ఇప్పుడు కొత్తగా మరో నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
అనంతపురం-హిందూపురం కలిపి ఒకటి, కాకినాడ-రాజమండ్రిలకు కలిపి ఒకటి, కర్నూలు, నెల్లూరులకు చెరొక పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో చేయవలసిన సరిహద్దుల నిర్ణయం వంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. అనంతపురం-హిందూపురం కలిపి పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తునందున పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేయాలని నిర్ణయించుకొన్నారు.
అలాగే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి మెట్రో హోదా కల్పించేందుకు విశాఖ మెట్రోపాలిటన్ అధారిటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అందుకోసం ముందుగా మెట్రోపాలిటన్ చట్టానికి సవరణ చేయవలసి ఉంటుంది కనుక దానికి జి.ఓ.జారీ చేయబోతోంది. త్వరలో మంత్రివర్గ సమావేశమయినప్పుడు వీటన్నిటిపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకొంటారు.