ఖైదీ నెం.150తో తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చాడు చిరు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కూడా… ఘనంగానే స్వాగతాలు పలుకుతున్నారు. విడుదలకు ముందే ఖైదీకి జరిగిన మార్కెట్ చూస్తుంటే గ్యాప్ వచ్చినా, పొలిటికల్‌గా కలసిరాలేకపోయినా.. వెండి తెరపై చిరు రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని అనిపిస్తోంది. దాదాపు రూ.90 కోట్లపై చిలుకు బిజినెస్‌తో టాలీవుడ్‌ని షేక్ చేసేస్తోంది ఖైదీ సినిమా. ఈ అంకెలు చిరులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చిరు ఇక మీదట సినిమాలపై వీరలెవిల్లో కాన్సట్రేషన్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. అందుకే మెల్లగా 151వ ప్రాజెక్టుకీ రంగం సిద్ధం చేసేస్తున్నాడు. వేసవిలోగా తన కొత్త సినిమాని పట్టాలెక్కించడానికి చిరు కృతనిశ్చయంతో ఉన్నాడని టాక్. అందులో భాగంగా కొన్ని కథల్ని, కొంతమంది దర్శకుల్ని లైన్లో పెట్టుకొన్నాడు. అందులో క్రిష్‌కే ఎక్కువ అకాశాలున్నాయని తెలుస్తోంది. దాదాపుగా క్రిష్ పేరు ఖాయమైపోయినట్టే. తన నుంచి వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఊహించినట్టుగానే విజయం అందుకొంటే… క్రిష్‌తో జట్టు కట్టడానికి చిరుకి ఇక ఎలాంటి అభ్యంతరమూ లేకపోవొచ్చు.
అయితే ఈ సినిమాని ఎవరి చేతుల్లో పెట్టాలన్న లెక్క తేలడం లేదు. ”డాడీ 151వ సినిమాని నేనే చేస్తా” అంటూ చరణ్ మొన్నామధ్యే చెప్పేశాడు. వరుసగా సొంత బ్యానర్లోనే సినిమాలు చేసుకొంటూ వెళ్లడం అంత కరెక్ట్ కాదని చిరు భావిస్తున్నాడట. మరోవైపు గీతా ఆర్ట్స్‌లో చిరు సినిమా చేయాలని అల్లు అరవింద్ కంకణం కట్టుకొన్నాడు. క్రిష్ చేతిలో సొంత సంస్థ ఉంది. తనకీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లోనే ఈ సినిమా చేయాలని అనిపిస్తోందని టాక్. మరోవైపు అశ్వనీదత్‌కి క్రిష్ ఓ సినిమా చేయాల్సివుంది. ఎప్పుడైతే చిరు – క్రిష్ సినిమా ఖాయమైనట్టు వార్తలొస్తున్నాయో… అశ్వనీదత్ ఎలెర్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది. చిరుతో సినిమా కోసం ఆయన కర్చీఫ్ వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తనకున్న కమిట్ మెంట్ దృష్ట్యా క్రిష్ కూడా దత్ మాట కాదనలేకపోవొచ్చు. పైగా చిరుకీ దత్‌కీ సన్నిహిత సంబంధాలున్నాయి. సో… చిరు 151వ సినిమా కోసం భారీ ఎత్తున పోటీ ఉందన్నమాట. మరి చిరు నిర్మాతగా ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి.