లాక్ డౌన్ తరవాత మళ్లీ `లైగర్` షూటింగ్ మొదలైంది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో షెడ్యూల్ మొదలవుతోంది. బుధవారం నుంచి ముంబైలో `లైగర్` కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందు కోసం నాలుగు ప్రత్యేక సెట్లు తీర్చిదిద్దారు. ఈ షెడ్యూల్ అంతా ఈ నాలుగు సెట్లలోనే జరగబోతోంది. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే.. ఓ రకమైన క్రేజ్ మొదలైపోయింది. దానికి తోడు `లైగర్` అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టేశాడు పూరి. లాక్ డౌన్ కంటే ముందు ముంబైలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశాడు పూరి. అయితే… విదేశీ ఫైటర్ల సమస్య ఈ సినిమాకు తలనొప్పిగా మారింది. లాక్ డౌన్ నిబంధనల దృష్ట్యా విదేశాల నుంచి ఫైటర్లను తీసుకురావడం కుదర్లేదు. దాంతో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ సమస్యలు కూడా తీరిపోయాయి. గత షెడ్యూల్ లోనే.. విదేశీ ఫైటర్లతో పూరి యాక్షన్ సీన్లని పూర్తి చేసేశాడు.