హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇదిగో పులి అంటే అదిగో తోక అనే వారికి కొదవలేదు. ఇలా ప్రపోజ్డ్ అనగానే ఆ చుట్టుపక్కల స్థలాల రేట్లు వచ్చే పదేళ్ల తర్వాత ఎంత ఉంటుందో అంత పెంచేస్తారు. కాస్త మంచి పెట్టుబడి అవుతుంది కదా అని ఆశపడే మధ్యతరగతి ప్రజల్ని నిండా ముంచేస్తారు. ఇప్పుడు ఫోర్త్ సిటీ చుట్టూ అదే దందా నడుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్మా సిటీ పెట్టాలని భూసేకరణ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఫార్మా సిటీతో పాటు అక్కడ ఫోర్త్ సిటీని కట్టాలని నిర్ణయించారు. ఫోర్త్ సిటీలోనే ఫార్మా సిటీ భాగం అవుతోంది. ఇప్పుడు ఫోర్త్ సిటీగా ప్రచారం అవుతోంది. రేవంత్ రెడ్డి ఈ ఫోర్త్ సిటీపై చాలా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఆయన పనిలో ఆయన ఉండగానే ఆ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ దందా ప్రారంభించారు . ప్రభుత్వం ఏర్పడినప్పటితో పోలిస్తే ఇప్పటికి ధరలను రెట్టింపు చేశారు. ఎవరైనా కాస్త ఆసక్తి చూపిస్తున్నారని తెలిస్తే …రేట్లను ఆకాశంలోకి తీసుకెళ్తున్నారు.
హైదరాబాద్ లో ఇప్పుడు ఆటోల మీద వందల ప్రకటన బోర్డులు కనిపిస్తున్నాయి. ఫోర్త్ సిటీ వద్ద ప్లాట్లు పేరుతో ఒక్క ఫోన్ నెంబర్ మినహా ఏ వివరాల్లేకుండా ప్రకటనలు ఇస్తున్నారు. ఇలాంటి వారు చేసేది అత్యధికంగా మోసాలు. భూములు ఉంటాయో లేదో తెలియదు.. ఉన్నా పది రూపాయల విలువైన దాన్ని వంద చేసి మాయ చేసి అమ్మేస్తూంటారు. ఎక్కువ మంది బ్రోకర్లు. ల్యాండ్ ఓనర్లు ఎవరూ ప్రకటనలు ఇవ్వరు. ల్యాండ్ ఓనర్ల దగ్గర ఓ రేటు మాట్లాడుకుని కస్టమర్ల దగ్గర మరో రేటు వసూలు చేస్తూంటారు
ఫోర్త్ సిటీ ఇంకా ప్రపోజ్డే. పట్టాలెక్కలేదు. అయినా ఇప్పటికే ధరలు రెట్టింపుచేశారు. భవిష్యత్లో పెరుగుతాయని చెప్పి పెరిగే ధరలకు తగ్గట్లుగా డిమాండ్ పెంచారు. నిజానికి అక్కడ ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించిన మరో పదేళ్ల తర్వాత మాత్రమే అక్కడ నివాసాలకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీడియాలో వచ్చే వార్తలు నమ్మకుండా క్షేత్ర స్థాయిలో చూసి.. కొనుగోలు చేయడం బెదరని సలహాలిస్తున్నారు.