తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని ప్రాధాన్యత అంశంగా తీసుకుని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం ప్రణాళికలు సిద్దమయ్యాయి. వచ్చే 50 సంవత్సరాల వరకు మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చెర్ల వరకు 330 అడుగుల వెడల్పుతో దారులు వేయనున్నారు. రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్ పేట, ముచ్చర్ల, ఆమన్నగర్ మండలం ఆకుతోటపల్లె వద్ద ఆర్ఆర్ఆర్ కలుపుతారు.
రాజేంద్రనగర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఆ మూడు గ్రామాలు బంగారమయం కానున్నాయి. అక్కడి భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతాల రాతను ఫోర్త్ సిటీ మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నెట్ జీరో సిటీలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. వాణిజ్య పంటలు, చెట్లు, రహదారుల వెంట మొక్కల పెంపకం వంటివి ఉండనున్నాయి.
ప్రస్తుతం ఆ మూడు గ్రామాల చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఎంత తక్కువకు కొనుగోలు చేస్తే.. అంత ఎక్కువగా తర్వాత లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. చిన్న చిన్న రియల్టర్లు కూడా ఇప్పుడు ప్లాట్లు అమ్మడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే పదేళ్ల తర్వాత ఉంటాయనుకున్న ధరలు ఇప్పుడే ఆయా గ్రామాల్లో ఉన్నాయి. అయినా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఫోర్త్ సిటీ ప్రణాళికలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.