నాలుగున్నరేళ్లలో వ్యవసాయానికి రూ. 2.52 లక్షల కోట్లు ఖర్చుచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ రంగంపై నాలుగో శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రూ.9,411 కోట్లు కౌలు రైతులకు ఇచ్చి.. 25 లక్షల మంది రైతులకు మేలు చేశామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 3,747 కోట్లు ఇచ్చామన్నారు. ఆక్వా కల్చర్‌కు విద్యుత్ రాయితీ ఇస్తున్నామన్నారు, వ్యవసాయం అత్యంత పవిత్రమైన వృత్తి అని.. వృద్ధికి వ్యవసాయం పునాదివంటిదన్నారు. కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయంపై ఆధారపడిన… జనాభాలోని 65శాతం ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రూ. 50 వేలు రుణమాఫీ చేశామన్నారు. 10శాతం వడ్డీ చెల్లిస్తూ 4 విడతలుగా రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టులలో 62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని… మరో ఆరు ప్రాజెక్ట్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తెచ్చి.. కృష్ణా డెల్టాకు రావాల్సిన జలాలను రాయలసీమకు తరలించామని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా ఆక్వాకల్చర్‌లో మరింత వృద్ధి తీసుకువచ్చి.. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధి సాధించామని చంద్రబాబు ప్రకటించారు. రైతులకు విత్తన, విద్యుత్, నీటి భద్రత ఇచ్చామని సంతృప్తి వ్యక్తం చేశారు. పంటకుంటలతో భూగర్భ జలాలు పెంచామన్నారు. రైతుల ఆదాయాన్ని నాలుగేళ్లలో 97శాతం రెట్టింపుచేశామని లెక్కలు చెప్పారు.వ్యవసాయంలో 11శాతం వృద్ధితో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఐదేళ్లు వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధించామని…ప్రకటించారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తో 2013-14లో రూ.6,128 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను… 2018-19 నాటికి రూ.19,070 కోట్లకు పెంచామన్నారు. 100 శాతం సబ్సిడీపై 20.04 లక్షల హెక్టార్లకు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలు పంపిణీ చేశామని ప్రకటించారు. కర్నూలు జిల్లా తంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు అవుతోందని 650 ఎకరాల్లో రూ. 670 కోట్లతో సీడ్ పార్క్‌ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 100 కంపెనీలు ఇక్కడ విత్తనాలు ఉత్పత్తి చేస్తాయన్నారు. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో…25.05 లక్షల కౌలు రైతులకు రూ.9,411 కోట్ల రుణాలు ఇచ్చామని.. మొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నెం.2లో ఉందన్నారు. ప్రత్తిపంట దిగుబడిలో మూడో స్థానం, వరి ఉత్పాదకతలో దేశంలోనే 3వ స్థానం, పాల వ్యాపారంలో దేశంలో 5వ స్థానంలో ఉన్నామని ప్రకటించారు.
వర్షం పడినా, తుపాన్లు వచ్చినా టెక్నాలజీ సాయంతో…రైతులను అప్రమత్తం చేసి పంటల్ని కాపాడుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలో 100శాతం వ్యవసాయ యాంత్రీకరణ చేస్తామని.. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం కింద 8 శాతం సాగవుతోందని గుర్తు చేశారు. రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేది ఆశయమని వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చెక్ డ్యామ్‌లు కడుతున్నామన్నారు. భూగర్భ జలాల గణాంకాలు తెలుసుకునేందుకు ఫిజియో మీటర్లు ఏర్పాటు చేసి.. కోటి ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేపడుతున్నామన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం కాదు పబ్లిక్ కోసం వ్యవసాయానికి అండగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది రైతులకు ఇబ్బంది లేకుండా పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.