ఏ దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడి ఒక ఏకీకృతమైన విధానం లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్‌గా చెబుతూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో అలాంటి అస్తవ్యస్థ పరిస్థితులే ఏర్పడ్డాయి. అయితే… కానీ అది బనానాల వల్ల కాదు.. మీడియా వల్ల. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వల్ల. ప్రపంచంతో పాటు ఇప్పుడు దేశం కూడా పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. వైరస్ దెబ్బకు జన జీవనం అతలాకుతలం అయిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో… దేశం మొత్తం.. దారి తప్పింది. దీనికి కారణం.. ఎలక్ట్రానిక్ మీడియా.. సోషల్ మీడియా. సినీ రంగంలో ఇంకా ఎదగని హీరోయిన్లు.. కాంట్రావర్శీ కింగ్లయిన వారి స్టేట్మెంట్లను పట్టుకుని నడిపించేస్తున్నారు. ప్రజల్ని సమస్యలు మర్చిపోయేలా చేస్తున్నారు. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు.
రియా, కంగనా తప్ప దేశానికి సమస్యలు లేవా…!?
గత రెండు, మూడు వారాల నుంచి జాతీయ మీడియాగా చెప్పుకునే వాటిల్లో అయితే రియా చక్రవర్తి లేకపోతే కంగనా రనౌత్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనే నటుడి ఆత్మహత్య కేసులో మీడియా స్వయంగా విచారణ చేస్తూ..ఇంటరాగేట్ చేస్తూ.. ప్రజలకు 24/7 ఉత్కంఠ కలిగిస్తూ.. కథనాలు ఇస్తున్నారు. ఆ మీడియా కథనాలకు తగ్గట్లే దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నారు. ఎలా అయినా రియాను నేరస్తురాలిగా చూపాలన్న పట్టుదలను కొన్ని చానళ్లు ప్రదర్శిస్తూ.. అంతే ప్రసారాలు చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ బ్యూరో .. ఈ మూడు దర్యాప్తు సంస్థలు కూడా అదే దారిలో ఉన్నాయి. చివరికి.. ఆమెపై హత్య అనుమానాలు వ్యక్తం చేసి.. ఆత్మహత్యకు పులికొల్పిందని ప్రచారం చేసి.. చివరికి సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మీడియా… మొత్తం ప్రజల అటెన్షన్‌ను అటు వైపు మరల్చేసింది. కంగనా రనౌత్ విషయంలోనూ అంతే. ఆమె సుషాంత్ విషయంలో మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నించారు. విచారణ ఏ కోణంలో జరిగితే.. ఆ కోణంలో తనకు ఇష్టం లేని వ్యక్తులపై ఆరోపణలు చేసుకుంటూ పోయారు. అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారిపోయింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
దేశ ఆర్థిక పరిస్థితి.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు హీరోయిన్ల ముందు చిన్నవేనా..?
భారతరత్న ప్రణబ్ ముఖర్జీ చనిపోయారు. ఆయనకు సంతాపంగా.. మీడియా కనీసం ఓ అరగంట అయినా.. ఆయన పరమపదిచిన విషయాన్ని చెప్పలేదు. ఆ ఆరగంటలో రియా చక్రవర్తిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు వేసుకున్నారు. భారతరత్నను కూడా గౌరవించలేకపోయింది జాతీయ మీడియా .. ఇక దేశ సమస్యలనేం పట్టించుకుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. కేంద్రం విధానాలు దశ.. దిశ లేకుండా ఉన్నాయి. ప్రజల ఆదాయం భారీగా పడిపోతే… పన్నుల పెంపుతో.. మరింత దారుణంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారు. ప్రజల దగ్గర ఆదాయాన్ని పెంచాల్సిన ప్రభుత్వాలు పిండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో… ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడానికి కావాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ.. చేతులెత్తేసినట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. మరో వైపు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. చర్చల పేరుతో చైనా కాలయాపన చేస్తూ.. మెల్లగా సరిహద్దుల్లో చొచ్చుకువస్తోంది. భారత్ ఆలసత్వాన్ని చైనా ఎంత అలుసుగా తీసుకుంటోంది అంటే.. అంతర్జాతీయ ఒప్పందాల్ని ఉల్లంఘించి అరవై ఏళ్ల తర్వాత సరిహద్దుల్లో కాల్పులకు కూడా తెగబడింది. అంటే చైనా దేనికైనా సిద్ధపడిందన్నమాట. అయినా… ఘనత వహించిన జాతీయ మీడియా.. సోషల్ మీడియా… మొత్తం టాపిక్‌ను.. హీరోయిన్ల వద్దనే ఉంచుతోంది.
దేశాన్ని తప్పుదోవ పట్టించి సాధించేదేమిటి..?
దేశంలో ఇప్పుడు అస్తవ్యస్థ పరిస్థితులు ఉన్నాయి. గందరగోళం ఉంది. ఇదంతా మీడియా వల్లే వచ్చింది. మీడియా చెప్పేది మాత్రమే నిజమనుకునే సగటు భారతీయుడు కూడా.. .ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది.. సరిహద్దుల్లో ఏం జరుగుతోంది లాంటి అంశాలను పట్టించుకోవడం లేదు. రియా చక్రవర్తి నేరం చేసిందా లేదా..? కంగనా అలా మాట్లాడటం కరెక్టా కాదా..? అన్న అంశాలపై చర్చలు జరుపుకుంటున్నారు. అది వారి తప్పు కాదు. దేశంలో ఇప్పటి సమస్యలు అవే అన్నట్లుగా మీడియా చిత్రీకరించిన మీడియాదే తప్పు. దేశాన్ని మీడియా.. సోషల్ మీడియా రిపబ్లిక్‌గా మార్చేశారు. కానీ మీడియా బాధ్యతేమిటి..? ఫోర్త్ ఎస్టేట్‌గా ఇచ్చిన గౌరవాన్ని మీడియా నిలబెట్టుకుంటోందా.. అన్నదే ఇక్కడ ప్రధానమైన సందేహం. ప్రజల్ని తప్పు దోవ పట్టించి.. దేశ సమస్యలను చిన్నవిగా చేసి.. దేశ ప్రజలకు ద్రోహం చేసి… మీడియా ఏం సాధిస్తుంది..?
టీఆర్పీల కోసం దేశాన్ని ప్రపంచం ముందు నవ్వుల పాలు చేస్తున్న మీడియా..!
దేశంలో మీడియాకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంది. అదే అధికార పార్టీకి అంతో ఇంతో మద్దతుగా ఉండే మీడియాకు అయితే.. ఆ స్వేచ్ఛ అపరిమితం. ప్రస్తుతం… దేశంలో ఉన్న మీడియా మొత్తం అధికారం వైపే ఉంది కాబట్టి.. వారి స్వేచ్ఛకు ఎదురులేదు. అందుకే… రియా చక్రవర్తిపై సిట్లు వేసి.. విచారణ చేస్తున్న మీడియా సంస్థలను గొప్పగా చూస్తున్నారు. కంగనా రనౌత్ ఏం చేసినా గొప్పగానే చెబుతున్నారు. ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలు.. పార్టీలపై విషం చిమ్ముతున్నారు. ఇదంతా టీఆర్పీల కోసమే. రాజ్యాంగపరంగా తమకు లభించిన స్వేచ్చను అడ్డం పెట్టుకుని దేశాన్ని మీడియా రిపబ్లిక్‌గా మార్చేశారు. ఇది దేశానికి తక్షణమే కాదు.. దీర్ఘ కాలిక నష్టాలను కలుగుచేయనుంది. భారత ప్రజలు నిజానిజాలు అంచనా వేసుకునే అవకాశం ఇవ్వకుండా… ప్రభుత్వ తప్పిదాలను కప్పి పెట్టేస్తున్నారు.
సినీ తారల వ్యక్తిగత అంశాలను హైలెట్ చేసే స్వేచ్చ కోసం రాజ్యాంగంలో “ఫ్రీ ప్రెస్” అవకాశం ఇవ్వలేదు. ప్రజలకు నిజాలు చెప్పి.. ప్రజా ప్రభుత్వాలు బాధ్యతాయుత మార్గంలో నడిచేలా చేస్తాయన్న ఉద్దేశంతోనే “ఫ్రీ ప్రెస్” ఆప్షన్ ఇచ్చారు. అంతే కానీ… టీఆర్పీల కోసం.. దేశానికి నష్టం చేయడానికి కాదు. నిఖార్సుగా దేశానికి వారు నష్టం చేస్తున్నారు. మీడియా రిపబ్లిక్‌గా మార్చేస్తున్నారు.