ప్రపంచంలో అతి పెద్ద యాపిల్ ఫోన్ తయారీ దారు అయిన ఫాక్స్ కాన్ గ్రూప్ దక్షిణాదిలో పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిజానికి ఫాక్స్ కాన్ గ్రూప్ యాపిల్ కంపెనీకి ఫోన్లు తయారు చేసి ఇవ్వడమే కాదు.. ఇంకా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ముందంజలో ఉంది. అనేక ప్రముఖ బ్రాండ్లకు తయారీ దారు ఫాక్స్ కాన్ మాత్రమే. ఈ సారి సొంతంగా ఈవీ వాహనాల మార్కెట్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఫాక్స్ కాన్ గ్రూప్ చైర్మన్ యంగ్ లీ ప్రదానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో తమ పెట్టుబడి ప్రణాళికల్ని చర్చించినట్లుగా మోదీ తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో భారీ ప్లాంట్ ను కొంగరకలాన్ లో నిర్మిస్తున్నారు. దీంతో వారి పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఏపీ ఉందని తేలిపోయింది.
నిజానికి ఇండియాలో ఫాక్స్ కాన్ మొట్టమొదట పెట్టుబడులు పెట్టింది ఏపీలోనే. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో మెగా ప్లాంట్లన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు కొత్త రంగాల్లో పెట్టుబడులకు ఏపీని పరిశీలిస్తున్నారు. ఈ మాత్రం హింట్ వస్తే ఏపీ ప్రభు్త్వం .. తదుపరి ఫాలోఅప్ గట్టిగానే చేసుకుంటుంది. అందుకే ఫాక్స్ కాన్ పెట్టుబడులు ఏపీకి వస్తాయని అంచనా వేస్తున్నారు.