తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘ ఫాక్స్ కాన్ ’ లక్ష ఉద్యోగాలు ఇచ్చేలా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.
ఫాక్స్ కాన్ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత వర్గాలు చెబుతున్నాయి. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజుకూడా కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ ల్యూకి అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ కంపెనీ చైర్మన్ యంగ్లూ ప్రారంభించనున్నారు. టీ వర్క్స్ ఏర్పాటులో ఫాక్స్ కాన్ కూడా సహకరించింది. ఫాక్స్ కాన్ సంస్థ ప్రపంచంలో వినియోగమయ్యే సెల్ ఫోన్లలో అత్యధికం తయారు చేస్తుంది. యాపిల్ ఐ ఫోన్లను కూడా యాపిల్ సంస్థ ఫాక్స్ కాన్ ద్వారానే ఉత్పత్తి చేయిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్లాంట్లు పెట్టిన ఫాక్స్ కాన్.. తెలంగాణలో ఏ యే రంగాల్లో పెట్టుబడులు పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.