తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ప్రతిష్టాత్మక ఆహ్వానాలు అందుతున్నాయి. కొద్ది రోజుల కిందట ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం రాగా… తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రెంచ్ సెనేట్ లో జరిగే యాంబిషన్ ఇండియా సదస్సులో ప్రసంగించాల్సిసిందిగా ఆహ్వానించింది. యాంబిషన్ ఇండియా సదస్సుల్లో ” గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా” అనే అంశంపై చర్చిస్తారు. ఇదే అంశంపై కేటీఆర్ కీ నోట్ స్పీకర్‌గా ప్రసంగించనున్నారు.
29వ తేదీన ఫ్రెంచ్ సెనేట్‌లో ఈ సమావేశం జరుగుతుంది. సాధారణంగా ఇటీవల సమావేశాలన్నీ వర్చువల్‌గా జరుగుతున్నాయి. కానీ ఫ్రాన్స్ సెనెట్‌లో మాత్రం ప్రత్యక్ష ప్దదతిలో జరుగుతుంది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది. భారత్ మిత్ర దేశాల మధ్య వ్యాపార , వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వం మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో పేర్కొంది.
యాంబిషన్ ఇండియా సదస్సులో 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఫ్రాన్స్ దేశ ఆహ్వానం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేస్తామన్నారు.