ప్రపంచంలో ఎక్కువ మందికి ఉద్యోగాలను, స్వయం ఉపాధి మార్గాలను సూచించే వాటిలో టూరిజం ముఖ్యమైంది. కేవలం పర్యాటక రంగ ఆదాయంపై ఆధారడి అభివృద్ది చెందిన దేశాలున్నాయి. ఒకటి రెండు టూరిజం స్పాట్ లు ఉన్నా, వాటినే ప్రచారం చేసుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. భారత్ లో మాత్రం ఎన్నో అద్భుతమైన టూరిజం ప్లేసెస్ ఉన్నా టూరిజం ఆదాయం చాలా తక్కువ.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది టూరిస్టులు వెళ్లే దేశం ఫ్రాన్స్. ఐఫిల్ టవర్, ఫ్యాషన్, ఇంకా అనేక అట్రాక్షన్స్ ఫ్రాన్స్ లో ఉన్నాయి. ఈనెల 27 ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా టాప్ 10 దేశాలను గమనిస్తే, వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఫ్రాన్స్. 2 అమెరికా 3. స్పెయిన్ 4. చైనా 5. ఇటలీ 6. టర్కీ. 7. జర్మనీ 8. యు,కె. 9. రష్యా 10. మెక్సికో.
మన దేశంలో పర్యాటక రంగం దాదాపు 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. టూరిజం వల్ల మన దేశానికి దాదాపు ఆరున్నర లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. విమాన టికెట్ల నుంచి హోటల్ రూములు, ట్యాక్సీలు, షాపింగ్ మాల్స్ వరకూ పలు విధాలుగా ఆదాయం వస్తుంది. అయితే మన దేశం అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించడంలో దారుణంగా విఫలమవుతోంది. చిన్న చిన్న దేశాలు భారీగా టూరిస్టులను ఆకర్షిస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో టూరిజం ఆదాయాన్ని భారీగా పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
విదేశీ టూరిస్టులను ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు, లేదా ఉమ్మడి ఏపీ చాలా వెనకబడి ఉంది. గత ఏడాది భారత్ కు వచ్చిన వారిలో ఎక్కువ మంది ఏయే రాష్ట్రాలను సందర్శించారనే వివరాలను టూరిజం శాఖ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం మహారాష్ట్ర మొదటి ర్యాంకు సాధించింది. తమిళనాడు 2, ఢిల్లీ 3, యూపీ 4, రాజస్థాన్ 5, పశ్చిమ బెగాల్ 6, కేరళ 7, బీహార్ 8, కర్ణాటక 9, గోవా 10వ ర్యాంక్ సాధించాయి. ఉమ్మడి ఏపీ మాత్రం ఈ టాప్ 10 జాబితాలో లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.