ఆంధ్రప్రదేశ్లో వలస కూలీలు ఎవరు నడుచుకుంటూ వెళ్తూ కనిపించినా .. వారందరికీ భోజనం పెట్టి.. నీళ్లు ఇచ్చి బస్సుల్లో సరిహద్దుల వరకూ దిగబెట్టి రావాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వలస కూలీల కష్టాలను ఆయన…కరోనా సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. మండిపోతున్న ఎండల్లో చిన్న పిల్లలతో .. చెప్పులు కూడా కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారని…జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇతరుల పట్ల మానవీయ కోణాన్ని కూడా మర్చిపోవద్దని అధికారులకు సూచించారు. వలస కూలీలకు సాయం అందించేలా విధి, విధానాలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. బస్సుల్లో తీసుకెళ్లే వలస కూలీలకు టికెట్ కూడా అడగొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
రోడ్లపై నడుచుకుంటూ వెళ్తోన్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాల్సిందేనన్నారు. గతంలో ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. బస్సుల్లో వలస కూలీలకు 15 రోజులపాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. వలస కూలీల అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ మీదుగా పెద్ద ఎత్తున వలస కూలీలు ఒడిషా, బెంగాల్ వైపు నడుచుకుంటూ పోతున్నారు. జాతీయ రహదారుల వెంట వారు వేలల్లో కనిపిస్తున్నారు.
ఏపీ వలస కూలీలు ఇతర ప్రాంతాల నుంచి ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున నడుచుకుంటూ ఏపీలోకి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వారు కూడా ఏపీలోకి వెళ్తున్నారు. వాళ్లని పాసులు ఉంటే తప్ప ఏపీలోకి అడుగు పెట్టనివ్వడం లేదు. సీఎం జగన్ మాత్రం వలస కూలీలపై మానవత్వం చూపాలని అంటున్నారు. అధికారులు మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. శనివారం ఉదయం తాడేపల్లి వద్ద బీహార్ వలస కూలీలపై..లాక్ డౌన్ ఉల్లంఘించారంటూ లాఠీచార్జ్ కూడా చేశారు.