ఉచిత బస్సు పథకం అమలు ఎలా జరుగుతుందో పరిశీలించడానికి ఏపీకి చెందిన ముగ్గురు మంత్రుల బృందం కర్ణాలకు బయలుదేరింది. ఇలా బయలుదేరక ముందే అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బస్సు చార్జీలను పదిహేను శాతం పెంచుతున్నట్లుగా ప్రకటన చేసింది. అంటే ఫ్రీ బస్సు ఖర్చు అంతా ఇతర ప్రయాణికుల మీద వేస్తోందన్నమాట. ఏపీ అధికారులు అక్కడ పథకం అమలు, నిధులు ఎలా ఆర్టీసి ఇస్తున్నారు .. లాంటి సమస్యలపైనా పరిశీలన చేస్తారు. ఈ క్రమంలో రెండు సార్లు చార్జీలు పెంచాల్సి వచ్చిందని వారు చెబుతారు. మరి చార్జీలు పెంచాలని మంత్రులు తమ సర్కార్ కు నివేదిక అందిస్తారా ?
ఉచిత బస్సు అనేది మహిళల్ని విపరీతంగా ఆకర్షించే పథకమే. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఎలాంటి పరిశీలన, కసరత్తు లేకుండా అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేసింది. ఫలితంగా ఆర్టీసీకి చాలా సమస్యలు వచ్చాయి. మొత్తంగా తెలంగాణ మొత్తం ఉచిత ప్రయాణం ప్రకటించేశారు. ఆ కారణంగా మొదట్లో ఉచితమే కదా అని ఊరకనే ప్రయాణించేవారు ఉన్నారు. తర్వాత అంతా సద్దుమణిగింది. ఇప్పుడు అవసరమైన మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. తెలంగాణలో ఉన్న మహిళలలో 90 శాతం ఏదోక సందర్భంలో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు.
ఏపీలో ప్రారంభ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. వెయ్యి బస్సులు కొని.. ప్రత్యేక సిబ్బందినికూడా నియమించుకోవాలని అనుకుంటున్నారు. అలాగే అనవసర రద్దీ ఉండకుండా.. ఉమ్మడిజిల్లాల పరిధిలోనే ఈ పథకాన్ని వర్తింప చేసే ఆలోచనలో ఉన్నారు. పథకం అమలులో వస్తున్న సమస్యలపై పరిశీలన చేస్తున్న రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి సారించి.. పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉంది.