అన్‌లాక్ -2లో నిబంధనలు కఠినంగా మలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ వన్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం కనిపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు నిర్లక్ష్య ధోరణిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించనందుకు ఇతర దేశాల్లో ఓ ప్రధానమత్రికే రూ. పదమూడు వేలు ఫైన్ వేశారని మోడీ గుర్తు చేశారు. ప్రజలంతా అలాంటి కట్టుబాట్లను విధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితో అన్‌లాక్-1 పూర్తవుతోంది. దీంతో రెండో దశ అన్‌లాక్‌ను కేంద్రం ప్రకటించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమయినందు.. జలుబు, దగ్గు వంటి వ్యాధుల సీజన్లోకి ప్రవేశిస్తున్నామని .. మరింత జాగ్రత్తగా ఉండాలని.. మోడీ పిలుపునిచ్చారు. సకాలంలో లాక్డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకోసం రానున్న ఐదు నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కిలో చక్కర ఉచితంగా పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. పేదలు దేశంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకోవచ్చన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా రూ. యాభై వేల కోట్లతో వలస కార్మికులకు సొంత ఊళ్లలోనే ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
మోడీ తన ప్రసంగాన్ని అన్‌లాక్-2కే పరిమితం చేశారు. మోడీ ప్రసంగాన్ని తప్పక వినాలంటూ.. హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేయడంతో.. చాలా మంది మోడీ ఎజెడా… చైనాతో ఉద్రిక్త పరిస్థితులేనని అనుకున్నారు. కానీ మోడీతన ప్రసంగంలో చైనా ప్రస్తావన తీసుకు రాలేదు. సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రజలకు చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ… ప్రసంగంలో ఏదో ఉంటుందని.. అమిత్ షా లాంటి నేతలు హింట్ ఇచ్చిన తర్వాత.. కేవలం అన్‌లాక్ 2 గురించి.. జాగ్రత్తలు తీసుకోవడం గురించి చెప్పి..మోడీ.. ప్రసంగం పూర్తి చేశారు. దీంతో…. ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసిన వారిలో నిరాశ వ్యక్తమయింది.