ఒక ఫంక్షన్ దగ్గర అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలూ కలుసుకున్నారు…డబ్బులేక పొలిటికల్ మెయింటనెన్సు కష్టమైపోతున్న కష్టాల నుంచి ఇసుక ముచ్చట్ల దగ్గర సంభాషణ ఆగింది. ఒక రీచ్ పాట మీద పోటీపడుతున్న 30 మందికీ పెద్ద కాంట్రాక్టర్ ఒక ఆఫర్ ఇచ్చాడు…మనిషికి పదేసి లక్షలు ఇస్తా పాట నాకు ఒదిలేయండి అన్నదే ఆ ఆఫర్…నిన్ను ఎవరు నమ్మారు ఇప్పుడే పదేసి లక్షలు ఇవ్వు వెళ్ళిపోతాం లేదా మేమంతా మూడు కోట్లు ఇస్తాం నువ్వే వేళ్ళిపో! అంతా కేష్ డీలే!! అని వాళ్ళు నిర్మొహమాటంగా చెప్పారు.
ఇసుక పాలసీ ఎలా మారుతుందో…అనే విషయాల మీద ఎవరి అంచనాలను వాళ్ళు చెబుతున్నారు. ఆదశలో ఒక నాయకుడు తనకు పరిచయమున్న చాలా పెద్ద కాంట్రాక్టర్ గురించి చెప్పుకొచ్చారు…లోకేష్ బాబుతో నిరంతరం టచ్ లో వుంటారన్న ప్రచారం వున్న ఆ కాంట్రాక్టర్ పోగేసిన అతి భారీ ఇసుక డంప్ కోర్టు వివాదంలో పడిపోయింది. ఆలిటిగేషన్ క్లియర్ అవ్వాలి…నాడబ్బు నాకు రావాలి…ఆతరువాతే ఇసుక కొత్త పాలసీ అని ఆకాంట్రాక్టర్ చెప్పిన ధీమా మాటలను ఉదాహరిస్తూ ఇదంతా నిజమే అనిపిస్తూంది అని నాయకుడు వివరించారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు ఉచిత ఇసుక నిర్ణయాన్ని తీసుకన్నారు.
ఇసుక వ్యాపకంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన రాజకీయ నాయకులకు ప్రధాన ఆదాయవనరైపోయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పైస్ధాయి వారిలో 95 శాతం మంది అధికారపార్టీవారే! వారివారి ప్రాంతాల్లో వున్న రీచ్ ల సంఖ్యను బట్టి వారికి వారం వారం డబ్బు పేకెట్లు అందుతాయి. దిగువస్ధాయిలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలూ ఒకటైపోయి వాటాలు పంచేసుకుంటారు.
చట్టాల్ని నియమ నిబంధనల్ని ఉల్లంఘించడం వేరు…నిరంతర అక్రమ ఆదాయాల కోసం చట్టాన్ని నియమ నిబంధనల్ని సామాన బేధ దండోపాయాలతో నిరంతరం ధిక్కరించే మాఫియా వ్యవస్ధ రూపొందడం వేరు. ఇలా తయారైన ఇసుక మాఫియా ఆగడాలకు పరాకాష్ట తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాసిల్దార్ వనజాక్షి మీద చేయిచేసుకోవడమే!
మహిళా సంఘాలను బినామీలుగా చేసుకుని పార్టీ పెద్దలు నడిపిస్తున్న ఇసుక వ్యాపారం ప్రజలపై మోయరాని భారాన్ని మోపుతోందని, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని, ఇదే కొనసాగితే ఇసుక మాఫియాలు కూడా పుట్టుకోస్తాయని అందరికంటే ముందుగా రాజమండ్రి పౌరప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్నికృష్ణ – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసి వివరించారు. ఒక విధంగా అది పిల్లిమెడలో గంట కట్టినంతటి సాహసం. ఆతరువాత రాజమండ్రి బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రి కి ఇదే విషయం వివరించారు.
అప్పటి నుంచీ ముఖ్యమంత్రి నానారకాల కసరత్తులు చేస్తూనే వున్నారు. ఇసుక ధరమోయలేక వినియోగదారులు చంద్రబాబుని బండబూతులు తిట్టుకుంటూనే వున్నారు. ప్రతిపక్షాలు నిరంతరం విమర్శిస్తూనే వున్నాయి. నిరంతర ప్రవాహం లాంటి ఇసుక ఆదాయాలతో రాజకీయ కార్యకర్తలు వ్యాపారులయ్యారు…కాంట్రాక్టర్లయ్యారు. సిండికేట్లయ్యారు..మాఫియాగా బలిసిపోయారు. ఇక వీళ్ళని చంద్రబాబు ఏమీ పీకలేరు అనే స్ధితికి ప్రజలు వచ్చేశారు.
ఈ పరిస్ధితిని అదుపుచేయలేకపోవడం వల్లకావచ్చు…200 కోట్ల రూపాయల కోసం ప్రజల్ని ఇంత వేధించకూడదన్న తాత్విక / ప్రజా స్వామిక దృక్పధం వల్ల కావచ్చు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం…అపూర్వమైనది..మౌలికమౌనది. ఇది మాఫియా రూపమెత్తిన రాజకీయ శక్తిని ఒకే వేటుతో నరికేసినంతటి సాహసోపేతమైనది..ధీరోదాత్తమైనది.
ఇందులో ప్రజాభిమానాన్ని చంద్రబాబు చవిచూడటం మొదలుపెడితే ఆయన వరుసే మారిపోతుంది. అపుడు ఆయన మరెన్నో మౌలికమైన ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకుంటారు.