ఢిల్లీలో మెట్రో రైళ్లన్నింటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఒక్క మెట్రో రైళ్లు మాత్రమే కాదు.. బస్సుల్లోనూ ఇదే ఆఫర్ వర్తిస్తుంది. ఇది దేశ రాజధాని ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న ఎన్నికల వరం. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీలో తుడిచి పెట్టుకుపోయింది. ఏడు లోక్ సభ సీట్లలో.. ఏడింటిలోనూ బీజేపీ విజయం సాధించింది. కొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని.. కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ప్రారంభించారు. ముందస్తుగా మహిళలను ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మెట్రో రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రకటించి… రెండు నెలల్లో అమలు చేయబోతున్నారు. ఢిల్లీ మెట్రోలో.. యాభై శాతం కేంద్ర ప్రభుత్వానికి…మరో యాభై శాతం… ఢిల్లీ ప్రభుత్వానికి వాటా ఉంది.
నిజానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పట్టు ఉంది. గతంలో.. ఏ ప్రభుత్వం చేయనన్ని కార్యక్రమాలు.. చాలా పరిమిత వనరులతోనే… మెరుగైన సౌకర్యాలు కల్పించారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. మొహల్లా క్లినిక్‌ల పేరుతో… ప్రజలకు ఇళ్ల దగ్గరకే వైద్య సేవలు అందించాలు. కరెంట్ చార్జీలు తగ్గించారు. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెంచాయి. అయితే ఇటీవలి కాలం లో కేజ్రీవాల్ బీజేపీ నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేతలు వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని చేర్చుకోవడం.. కేసులు పెట్టడం వంటి వాటితో… సవాల్ విసురుతున్నారు. దాంతో కేజ్రీవాల్.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడాన్ని సవాల్‌గా తీసుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఢిల్లీలో బీజేపీ ఉత్సాహంగా ఉంది. చాలా కాలంగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. షీలా దీక్షి ఏకంగా మూడు సార్లు ఢిల్లీ సర్కార్‌కు చీఫ్‌గా పని చేయగా.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనుకున్నారు కానీ… కేవలం మూడు సీట్లకే పరిమితమయింది. ఈ సారి మాత్రం గురి తప్పకూడదన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. బీజేపీని ఎదుర్కోవడానికి కేజ్రీవాల్… మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. మరి వర్కవుట్ అవుతుందో లేదో..!