తెలంగాణలో వివాదాస్పదంగా మారిన ఇంటర్ ఫలితాల తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డితోపాటు కార్యదర్శులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థిలందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలని బోర్డుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రీవేల్యూయేషన్, రీకౌంటింగ్ ఈ రెండు ఉచితంగానే జరగాలని అధికారులకు సీఎం చెప్పారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షను వీలైనంత త్వరగా నిర్వహించాలనీ, విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని సీఎం అన్నారు. రీవేల్యూయేషన్, రీ వెరిఫికేషన్లతోపాటు సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతల్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ కు ముఖ్యమంత్రి అప్పగించారు.
ఇంటర్ బోర్డులో తలెత్తిన వివాదంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ… ఈ వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంలో సీఎం మాట్లాడుతూ… పరీక్షల నిర్వహణను పూర్తిగా ఒక స్వతంత్ర సంస్థకు ఇస్తే ఎలా ఉంటుందనీ, వివాదాలకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఈ వ్యవస్థను తయారు చేయాల్సి ఉందని అన్నారు. ఇంటర్ బోర్డులో గత కొన్నాళ్లుగా వివాదాలు నడుస్తున్నాయన్న అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారనీ, ఈ సందర్భం ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు కొంత ఊరట లభించినట్టే. అయితే, ఫలితాలు వెలువడ్డ తరువాతి నుంచీ రీవేల్యుయేషన్ కోసం ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఫీజులు చెల్లించారు. సబ్జెట్ కి రూ. 600 చొప్పున చాలామంది కట్టారు. వీరు చెల్లించిన ఫీజుల్ని వాపసు ఇస్తారో లేదో ఇంకా స్పష్టంగా అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉచిత రీవెరిఫికేషన్ తో విద్యార్థులకు కొంత ఊరట. అయితే, ఈ గందరగోళానికి కారణమైన వారిపై చర్యలు కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. జరిగిన అవకతవకలకి కేవలం ఉచిత రీవెరిఫికేషర్ ఒక్కటే పరిష్కారం కాదు కదా!