హైదరాబాద్: కారుచవకగా మొబైల్ ఫోన్ అంటూ జాతీయంగా, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ సంస్థ యజమాని మొహిత్ గోయెల్ తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించారు. రు.251లకు ఫోన్‌ను అందించటమే కాకుండా, దానిపై రు.31 లాభం కూడా గడిస్తానని చెప్పుకొచ్చారు. నొయిడాలోని తమ కార్యాలయంపై పోలీసులు, ఐటీ అధికారుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు తనను వెంటాడుతున్నారని, తానేమి తప్పు చేశానని ప్రశ్నించారు. ఏప్రిల్ 15 నుంచి డెలివరీ ఇస్తానని, జూన్ 30 నాటికి డెలివరీలు పూర్తిచేస్తానని నమ్మబలికారు. తమదేమీ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే సంస్థ కాదని చెప్పారు. వినియోగదారుల సొమ్మును ఎస్క్రో ఎకౌంట్లో ఉంచుతామని అన్నారు. 7 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఫస్ట్ బ్యాచ్‌లో 25 లక్షల యూనిట్లకు మాత్రమే ఆన్ లైన్ బుకింగ్స్ తీసుకుంటున్నామని, మరో 25 లక్షలను ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లద్వారా అమ్ముతామని చెప్పారు.
మరోవైపు కేంద్ర టెలికామ్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ రు.251 సెల్ ఫోన్ ఆఫర్‌పై దర్యాప్తు జరపమని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం కార్యదర్శి అరుణాశర్మకు ఆదేశాలిచ్చారు. బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్యా ఈ ఆఫర్‌పై రాసిన లేఖపై స్పందిస్తూ మంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. రు.251లకు మొబైల్ ఫోన్ అందించటం సాధ్యం కాదని, ఈ ఆఫర్ వెనకు దురుద్దేశ్యాలు ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.