హైదరాబాద్: రు.251లకే స్మార్ట్ ఫోన్ అందిస్తానంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ సంస్థ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ తరపున కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్న సైఫ్యూచర్ అనే బీపీఓ సంస్థ, రింగింగ్ బెల్స్ పెద్ద ఫ్రాడ్ అని ఆరోపించింది. తమకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించటంలేదని మండిపడింది. సైఫ్యూచర్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అనూజ్ భారతి మీడియాతో మాట్లాడుతూ, తమకు ఆ సంస్థ గురించి మొదటినుంచీ అనుమానంగానే ఉందని అన్నారు. ఎన్నో విడతలు చర్చలు జరిపిన తర్వాత… అదీ లాంచింగ్ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పటంతో ఈ ప్రాజెక్టును తీసుకున్నామని చెప్పారు. లాంచింగ్ అయిన మొదటి రోజులలో లక్షల సంఖ్యలో కాల్స్ వచ్చాయని, వాటన్నంటికీ తాము చక్కగా సమాధానాలు చెప్పామని తెలిపారు. తమ సేవలపై వారు సంతోషం కూడా వ్యక్తం చేశారని చెప్పారు.
అయితే పేమెంట్ల గురించి అడగగానే వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ, సేవలు సంతృప్తికరంగా లేవంటూ తమ కాంట్రాక్ట్ రద్దు చేశారని అనూజ్ తెలిపారు. వారిదంతా మోసపూరిత వ్యవహారమని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అయితే, రింగింగ్ బెల్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం కస్టమర్ల కాల్స్‌కు సైఫ్యూచర్ సంస్థ సరిగా స్పందించలేదని ఆరోపించారు. దీనిపై వినియోగదారులు తమకు అనేక ఫిర్యాదులు చేశారని చెప్పారు.