ఫ్రాన్స్ నుంచి ప్రతినిధి బృందం వచ్చింది.. పెట్టుబడులు తెస్తుందోచ్ అని రెండు రోజుల నుంచి ఏపీ ప్రభుత్వ వర్గాలు హడావుడి చేశాయి. ఫ్రాన్స్ బృందంతో ఒక సారి పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి… మరో సారి… జగన్ సమావేశమయ్యారు. సీఎం జగన్ అయితే.. ఆ ఫ్రాన్స్ పారిశ్రామిక బృందాన్ని తన ఇంటికే ఆహ్వానించారు. ఆ బృందంలో సభ్యులెవరో… తెలిసిన తర్వాత మాత్రం… ప్రభుత్వంపై సూటి విమర్శలు ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ బృందంలో ఉన్నది ఎవరో కాదు.. వికాట్ కంపెనీ యజమానులు. ఈ వికాట్ కంపెనీ .. భారతీ సిమెంట్స్ కంపెనీ యజమాని. భారతీ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డిదని అందరికీ తెలుసు. అయితే.. ఈ భారతీ సిమెంట్స్ ఉత్పత్తి ప్రారంభించీ .. ప్రారంభించక ముందే.. అందులో 51 శాతం వాటాను.. ఫ్రాన్స్ కు చెందిన వికాట్ కంపెనీ రూ. రెండు వేల కోట్లకు కొనుగోలు చేసేసింది. అప్పట్లో ఇదో సంచలనం.
ఈ డీల్ పై గూడు పుఠాణి ఏదో జరిగిందని చాలా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే… 51 శాతం వాటా కొనుగోలు చేసినప్పటికీ.. వికాట్ కంపెనీ.. 49 శాతం మైనార్టీ వాటా ఉన్న… జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులకే యాజమాన్య హక్కులు కల్పించింది. ఇప్పుడు ఆ వికాట్ కంపెనీ యజమానులే… సీఎం జగన్.. ఇంట ఆత్మీయ ఆతిధ్యం స్వీకరించారు. ఫ్రాన్స్ .. పెట్టుబడిదారుల బృందంగా ప్రచారం పొందారు. ఇప్పుడు వారు వికాట్ కంపెనీ ప్రతినిధులగా తేలింది. దీంతో.. టీడీపీ మద్దతుదారులు పాత చరిత్రనంతా బయటకు తీసి… ప్రచారం చేయడం ప్రారంభించారు.
నారా లోకేష్ మరిన్ని సెటైర్లు వేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు…ఫ్రాన్స్ నుంచి ఓ కంపెనీ వచ్చిందని విని ఆశ్చర్యపోయానన్నారు. ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్లు జగన్ వ్యాపార భాగస్వాములని తేలిందన్నారు. అంటే వచ్చింది సీఎం జగన్ చుట్టాలే .. మరో క్విడ్ ప్రోకో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మొత్తానికి నాలుగు నెలల్లో పెట్టుబడులంటూ వచ్చిన విదేశీ బృందం గాలి అలా తీసేశారన్నమాట..!