బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరానికి ఉత్తరాన గల స్కర్ బీక్ అనే ప్రాంతంలో ఈరోజు మళ్ళీ రెండు ప్రేలుళ్ళు జరిగాయి. మొన్న మంగళవారంనాడు బ్రసెల్స్ విమానాశ్రయంలో, మెట్రో రైల్వే స్టేషన్లో జరిగిన విస్పోటనాలలో 35మందికి పైగా మరణించారు. అప్పటి నుంచి భద్రతా దళాలు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. బ్రసెల్స్ జరుగుతున్న ఈ బాంబు దాడులకు పారిస్ నగరంలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదితో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఫ్రాన్స్ భద్రతా దళాలు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో పారిస్ నగరంలో గురువారం రాత్రి అర్జెంషిల్ అనే ప్రాంతంలో శోదాలు నిర్వహించి రెడ క్రికెట్ అనే 34 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతని ఇంట్లో నుంచి భారీగా మారణాయుధాలు, బాంబులు, మేకులు వగైరా స్వాధీనం చేసుకొన్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకి రిక్రూటర్ గా పనిచేస్తున్న అతను త్వరలో పారిస్ నగరంలో మరో భారీ విద్వంసానికి సిద్దం అవుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతనిని విచారించినపుడు బ్రసెల్స్ లో జరిగిన బాంబు దాడుల గురించి చాలా వివరాలు తెలిసాయి. అతని ద్వారానే స్కర్ బీక్ అనే ప్రాంతంలో కూడా ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేయబోతున్నట్లు తెలియడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం బెల్జియం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఆ సమాచారంతో ఈరోజు మధ్యాహ్నం భద్రతాదళాలు స్కర్ బీక్ ని చుట్టుముట్టి శోదాలు నిర్వహిస్తుండగా, ఒక ట్రామ్ స్టేషన్ వద్ద వరుసగా రెండు విస్పోటనాలు జరిగాయి. వెంటనే భద్రతా దళాలు అక్కడికి చేరుకొని ఒక వ్యక్తిని కాల్చి చంపాయి. ఇంకా నగరంలో మరెక్కడయినా ఉగ్రవాదులు దాగి ఉన్నారేమో కనుగొనేందుకు, బెల్జియం దేశ భద్రతాదళాలు బ్రేసిల్స్ నగరాన్ని ఆణువణువూ జల్లెడ పడుతున్నాయి.