నారా లోకేష్ తను మంత్రివర్గంలో చేరబోవడం లేదంటూ స్పష్టం చేయడంతో తెదేపా నేతలు దాని అనుకూల మీడియా మళ్ళీ కొత్త పల్లవి అందుకొన్నారు. అదే…చినబాబుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం చాలా అవసరం అని. ఇంతకు ముందు ఆయనని డిల్లీ పంపడం చాలా అత్యవసరం అన్నట్లు అందరూ కోరస్ పాడారు. ఆ తరువాత దాని వలన లాభం కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని లెక్కలు కట్టి, చిన్నబాబు సేవలు రాష్ట్రానికి చాలా అవసరం కనుక రాష్ట్ర మంత్రిగా చేయాలని అందరూ కలిసి తెగ ఊదరగొట్టారు. మళ్ళీ దాని వలన కూడా ఆశించినంత ప్రయోజనం ఉండదని లెక్కలు కట్టుకొన్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆయన సేవలు పార్టీకి చాలా అవసరం అనే కొత్త పల్లవి అందుకొన్నారు. తెదేపాకి అనుకూల మీడియాలో చిన్నబాబుకి పార్టీ బాధ్యతలు అప్పగించడం వలన కలిగే లాభాల గురించి అప్పుడే కధనాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పెద్దబాబు కూడా అదే మార్గంలో పయనించి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారని, దాని వలన ఆయనకు పార్టీలో కార్యకర్తలను కూడా పేర్లు పెట్టి పలుకరించేంత పరిచయాలు, అందరితో పటిష్టమయిన సంబంధాలు ఏర్పడ్డాయని పేర్కొంది. ప్రస్తుతం చిన్నబాబు కూడా పార్టీలో అట్టడుగుస్థాయి నుంచి మంత్రుల వరకు అందరితో చక్కగా సంబంధాలు కలిగి ఉన్నారని, కనుక ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే ఆయన పార్టీని బలోపేతం చేయడంతో బాటు, తన ఉజ్వల భవిష్యత్ కి తనే మార్గం ఏర్పరచుకొనే అవకాశం లభిస్తుందని రీజనింగ్ ఇస్తున్నారు. అదే ఆయనని మంత్రిగా చేస్తే పాపం..పార్టీ కార్యకర్తలు అన్యాయం అయిపోతారని కనుక వచ్చే నెలలో ఆయనకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కనుక మళ్ళీ కొన్ని రోజులపాటు ఈ కొత్త భజన వినడానికి జనాలు మానసికంగా సిద్ధం అయిపోతే మంచిది. అయితే మళ్ళీ అదే ప్రశ్న వేయవలసి వస్తుంది. చిన్నబాబుని రాజ్యసభకి పంపి, కేంద్ర మంత్రిని చేయాలనుకొన్నా లేదా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా తీసుకొన్నా లేదా ఆయనను పార్టీ అధ్యక్షుడిగా చేయాలనుకొన్న కాదని అభ్యంతరం చెప్పే ధైర్యం ఎవరికుంది? ఉన్నా వారి అభ్యంతరాలను ఖాతరు చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడికి ఏముంది? తన కొడుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే పార్టీలో వాళ్ళు కాదన్నారా లేక ప్రజలు కాదన్నారా? కాదన్నా ఆయన వెనక్కి తగ్గుతారా? మరి అటువంటప్పుడు అనవసరమయిన ఈ ప్రచారం ఎందుకు? ఆనక తూచ్..కేంద్ర మంత్రిని చేయాలి తూచ్..రాష్ట్ర మంత్రి చేయాలి తూచ్..పార్టీ అధ్యక్షుడుగా చేయాలి..అని సవరణలు, వివరణలు ఇచ్చుకోవడం దేనికి? అనవసరమయిన ఈ ప్రచారం ద్వారా తెదేపా అధిష్టానం ఏమి ఆశిస్తోందో తెలియదు కానీ చినబాబు ఏ పదవి చేప్పట్టడానికి కూడా యోగ్యుడు కాడని చెప్పుకొంటున్నట్లవుతోందనే విషయం తెదేపా అధిష్టానం గ్రహిస్తున్నట్లు లేదు.