సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న జూ.ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సరికొత్త వివాదంలో చిక్కుకొంది. ఆ సినిమా కోసం విడుదల చేసిన ఒక పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, శనివారం వంద మందికి పైగా ముస్లిం యువకులు జూ.ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బంజారా హిల్స్ ప్రాంతంలో బైక్ ర్యాలి నిర్వహించి తమ నిరసన తెలిపారు. వారు చేసిన ఈ హడావుడికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అనంతరం వారందరూ మాసాబ్ ట్యాంక్ చేరుకొని అక్కడ ఉన్న సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఆ సినిమా పోస్టర్, సన్నివేశంపై తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇచ్చేరు.
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్న జూ.ఎన్టీఆర్,రాకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ చేస్తున్న ఒక సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో ఒక గోడ మీద ఇస్లాం మతానికి సంబందించి ఉర్దూలో వ్రాయబడిన సందేశాలు గల రెండు పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాటి ముందు నిలబడి హీరో, హీరోయిన్లు డ్యాన్స్ చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. తక్షణమే ఆ పోస్టర్లని, సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ తరువాత జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేసారు. ఆ సినిమాలో తక్షణమే ఆ సన్నివేశాన్ని తొలగించాలని లేకుంటే సినిమా విడుదల కాకుండా అడ్డుకొంటామని సినీ నిర్మాతలను మీడియా ద్వారా హెచ్చరించారు. నాన్నకు ప్రేమతో సినిమాకి బాలకృష్ణ అభిమానుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ వివాదం మొదలయింది.