పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోవడం ఒక పెద్ద నష్టమయితే, పార్టీలో అతని స్థానం ఆక్రమించడానికి నేతల మధ్య పోటీ, అలకలు మరో పెద్ద తలనొప్పిగా మారాయి జగన్మోహన్ రెడ్డికి. భూమా నాగిరెడ్డి తెదేపాలోకి వెళ్లిపోయిన తరువాత అంతవరకు ఆయన నిర్వహిస్తున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కోసం పార్టీలో నేతల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. దాని కోసం పార్టీలో జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లు పోటీ పడుతుంటే వారిని కొత్తగా ఎమ్మెల్యే అయిన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కి జగన్ ఆ పదవి కట్టబెట్టారు. దానితో జ్యోతుల నెహ్రూ ఆయనతోబాటే వరుపుల సుబ్బారావు పార్టీ నుంచి అవుట్ అయిపోయారు. ఇది వైకాపాకి ఊహించలేని తట్టుకోలేని పెద్ద దెబ్బే.
ఆ సమస్యకి కొనసాగింపుగా జ్యోతుల నెహ్రూ వెళ్లిపోవడంతో ఖాళీ అయిన తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్ష పదవి కోసం మళ్ళీ పార్టీలో జక్కంపూడి, మాజీ జెడ్.పి. చైర్మన్ వేణు తదితరులు పోటీ పడుతున్నారు. జిల్లాలో చక్రం తిప్పుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జక్కంపూడి కుటుంబంలో ఒకరికి ఆ పదవి ఇవ్వాలని జగన్ పై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఈసారి కూడా జగన్ అందరి అభిప్రాయాలు తీసుకొన్న తరువాత, మళ్ళీ తనకు నచ్చిన వ్యక్తి కన్నబాబుకే ఆ పదవి కట్టబెట్టాలనుకొంటున్నట్లు ప్రకటించారు.
ఆయన నిర్ణయాన్ని పార్టీలో సీనియర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్ కన్నబాబుకే ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి చేరువ అవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. కనుక అదే వర్గానికి చెందినవారిలో ఎవరో ఒకరికి ఆ పదవి కట్టబెడతారనుకొంటే, వారిలో అందరికంటే జూనియర్ అయిన కన్నబాబుని జిల్లా అధ్యక్ష పదవికి జగన్ ఎంచుకోవడంతో, ఆ పదవిని ఆశిస్తున్న సీనియర్లు అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నబాబు పార్టీలో మిగిలిన వారికంటే జూనియర్ అయినప్పటికీ జగన్ ఆయననే ఎంచుకోవడానికి చాలా బలమయిన కారాణాలే ఉన్నాయి.
ఆయన కూడా కాపు సామాజిక వర్గానికే చెందినవారు. రాజకీయాలలోకి రాక మునుపు జర్నలిస్టుగా పనిచేసి ఉన్నందున రాష్ట్ర రాజకీయాల గురించి, పార్టీ బలాబలాలు, పరిస్థితి, వ్యవహారాలపై మంచి అవగాహన కలిగి ఉన్నవ్యక్తి. ఏ విషయం గురించయినా పూర్తి వివరాలు తెలుసుకొన్న తరువాతనే మాట్లాడే గుణం. అందువలన మంచి పాయింటుతో మాట్లాడి ప్రత్యర్ధులను నోళ్ళు కట్టించగలిగే నేర్పు కలిగి ఉండటం. అందరితో స్నేహంగా ఉంటూ కలుపుకుపోయే గుణం. పార్టీ పరంగా చూస్తే జగన్ తీసుకొన్న నిర్ణయం బాగానే ఉంది. కానీ అది సీనియర్ల అహాన్ని దెబ్బతీసేదిగా ఉంది కనుక దీని తదనంతర పరిణామాలు ఏవిధంగా ఉంటాయో మరే సీనియర్ నేతని పార్టీని వీడి బయటకు వెళ్ళేలా చేస్తాయో చూడాలి.