అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లుకి మించి పైసా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తేల్చి చెప్పేశారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం, విజయవాడ, గుంటూరు నగరాలలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరించడానికి ఇచ్చిన రూ.1,000 కోట్లుతో కలిపి మొత్తం రూ. 2,500 కోట్లు ఇచ్చేసినట్లే కనుక ఇంక అమరావతి కోసం కొత్తగా ఇచ్చేదేమిలేదని చెప్పకనే చెప్పారు. కేంద్రం ఇంత నిర్దయగా వ్యవహరిస్తుందని బహుశః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఊహించి ఉండరు. ఇక కేంద్రాన్ని ఎంత బ్రతిమాలినా అమరావతి కోసం ఒక్క పైసా వచ్చే అవకాశం లేదు కనుక స్విస్ ఛాలెంజ్ పద్దతిలోనే రాజధాని నిర్మించుకోవలసి ఉంటుంది.
అయితే ఆ పద్దతిని తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని వైకాపా ఇప్పటికే ప్రకటించింది. అవసరమైతే డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి స్విస్ ఛాలెంజ్ విధానానికి అనుమతించవద్దని కోరుతామని వైకాపా చెపుతోంది. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాట వినకపోతే, తాము ప్రజలతో కలిసి ప్రభుత్వంతో పోరాడుతామని వైకాపా హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానితో గొంతు కలిపింది. విదేశాలపేరు చెపితేనే మండిపడే వామపక్షాలు ఎలాగూ దానిని వ్యతిరేకించడం ఖాయం.
అమరావతి కోసం కేంద్రం నిధులు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బు లేదు. స్విస్ ఛాలెంజ్ విధానం ప్రతిపక్షాలకి అంగీకారం కాదు. దీనితో ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది కనుక, రాష్ట్రంలో ప్రతిపక్షాలు అంగీకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే రాజధాని నిర్మించక తప్పదు. ఇప్పటికే అది సిద్దపడింది కూడా. కనుక ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేయడమూ ఖాయమే. అయితే అమరావతి కోసం కేంద్రం ఇంకా అధనంగా నిధులు ఇవ్వదలచుకోలేదు కనుక మోడీ ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకపోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభ్యంతరాలని పట్టించుకోకపోతే స్విస్ ఛాలెంజ్ పద్దతిని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి కనుక అదీ తప్పకపోవచ్చు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దగ్గర నుంచి నిర్మాణం వరకు అడుగడుగునా సమస్యలే..అవరోధాలే ఎదురవుతున్నాయి. వీటినన్నీ అధిగమించి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మించగలిగితే ఆ క్రెడిట్ పూర్తిగా ఆయనకే స్వంతం అవుతుంది. లేకుంటే సింగపూర్ వంటి రాజధానిని నిర్మించి చూపుతానని గొప్పలు చెప్పుకొన్నందుకు అభాసుపాలు కాకతప్పదు.