ఈ ఏడాది ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజు. భారీగా సంబరాలకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ క్యాడర్ సంబరాలకు కిక్ ఉంటుందా లేకపోతే దిగిపోతుందా అన్నది కూడా తేలనుంది. దీనికి కారణం.. ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సుప్రీంకోర్టులో 17వ తేదీన విచారణ జరగనుందటమే. సుప్రీంకోర్టులో సీబీఐ దర్యాప్తు చేయడం సరికాదన్న తీర్పు వస్తే సరే లేకపోతే.. సీబీఐ ఒక్క సారిగా పంజా విసిరే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెంంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం ఎస్పీ స్థాయి అధికారి సీఎస్ కి ఆరుసార్లు లేఖ రాశారు. సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని చెబుతున్నారు. అందుకే శుక్రవారం ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని శుక్రవారం విచారణ తర్వాత కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్, ఆనాటి ఫుటేజీని పరిశీలించారు. సీఏం వద్దకు ఎవరు చేరవేశారో కాల్ డేటా, టవర్ లొకేషన్స్ పరిశీలించారు. పోలీస్ అధికారుల టైమింగ్స్, ఎమ్మెల్యేల స్పై కెమెరాలను సరిచూసుకున్నారు. టెక్నికల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎవరెవరని విచారించాలో ప్లాన్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాక సీబీఐ విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు.