ఏపీ, తెలంగాణ అంటే… మూడు నెలల కిందటి వరకూ.. ఉప్పు – నిప్పు. కానీ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. ఉమ్మడి రాష్ట్రంలా పరిస్థితి మారిపోయింది. సాక్షాత్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్… ఏపీ, తెలంగాణ వేర్వేరు కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంగానే భావించుకోవాలన్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సందేశం ఇచ్చారు. ఇంతలో ఇంత మార్పు ఎలా సాధ్యమయిందంటే.. కేవలం స్నేహం వల్లే…! జగన్, కేసీఆర్‌ల మధ్య స్నేహంతోనే… ఇది సాధ్యమయింది.
కలిసొచ్చిన స్నేహంతో నడిచొచ్చిన విజయాలు..!
కేసీఆర్, జగన్.. స్నేహానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. ఒకప్పుడు.. ఏ రాజకీయ కారణాలతో.. అయితే.. బద్ధ శత్రువులుగా.. ఒకరినొకరు భావించుకున్నారో… తీవ్ర విమర్శలు చేసుకున్నారో… అదే రాజకీయ కారణాలతో స్నేహితులగా మారిపోయారు. శతృత్వం స్థానే మితృత్వం వచ్చింది. స్నేహం అద్భుతాలు చేసి చూపిస్తుందనేదానికి.. కేసీఆర్ – జగనే సాక్ష్యం. ముందుగా రాజకీయ పరంగా ఇద్దరూ కలిసి అద్భుతాలు చేశారు. ముందస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అండగా నిలిచే సీమాంధ్రులను… టీఆర్ఎస్ వైపు మళ్లించడంలో..జగన్ సహకరించారు. ఆ తర్వాత వైసీపీ ప్రత్యర్థిని కార్నర్ చేయడానికి.. టీఆర్ఎస్.. సంపూర్ణంగా సహకరించింది. జగన్, కేసీఆర్.. ఆప్తమిత్రులైపోయారని.. ఎన్నికల ఫలితాలు రాక ముందే తేలిపోయింది. ఇద్దరి స్నేహం… ఫలితాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అది స్నేహ బంధం మరింత ధృడత్వానికి దారి తీసింది.
ఉమ్మడి ప్రాజెక్టే స్నేహానికి స్టాట్యూ..!
రాజకీయ స్నేహం.. ప్రజాప్రయోజనాలకు కూడా ఉపయోగపడకపోతే.. సార్థకత ఉండదు. మొదటి క్షణం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంచుకోవడానికి ప్రయత్నించారు. వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీఎంల మధ్య స్నేహమే వారధిగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య తెగని పంచాయతీ.. జల వివాదాలే. వీటిని పరిష్కరించుకోవడానికి.. కూడా.. జగన్… స్నేహమనే వారధిని ఎంచుకున్నారు. ఈ స్నేహాల్లో సరికొత్త శిఖరం… ఉమ్మడి ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం. ఇప్పటి వరకూ రాష్ట్రాల మధ్య జల వివాదాలే ఉన్నాయి. ఎవరి రాష్ట్రంలో వారు కట్టుకునే ప్రాజెక్టులకే.. దిగువ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ కేసీఆర్ – జగన్… మితృత్వంతో దూదిపింజలా.. అలాంటి వివాదాల్ని తొలగించవచ్చని.. నిరూపించారు. తెలంగాణలో.. ఉమ్మడిగా ప్రాజెక్ట్ కడుతున్నారు. దేశం.. మొత్తం జల వివాదాల పరిష్కారానికి ఓ గొప్ప స్టాట్యూలాగా.. ఈ ప్రాజెక్ట్ ఉండిపోవడం ఖాయమే.
విడిపోయిన రాష్ట్రాలను ఏకం చేస్తున్న స్నేహం..!
రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే.. కాదు.. అంతకు ముందు ఉద్యమ కాలం నుంచి… ఆంధ్రోళ్లు.. తెలంగాణ వాళ్లు అనే విభజన రేఖ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ… స్పష్టంగా కనిపిస్తోంది.కానీ అది గత రెండు, మూడు నెలలుగా.. అదృశ్యమవుతోంది. ప్రభుత్వాలతో సహా అధికారులు… నేతలు అందరూ.. మనమంతా ఒక్కటే అనుకునే పరిస్థితికి వస్తున్నారనే.. అది ఫ్రెండ్షిప్ పుణ్యమే. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగే మిత్రులూ ఉండరు. రేపు రాజకీయంలో.. తేడాలొచ్చినా.. వీరి స్నేహం మాత్రం.. ఇలాగే ఉంటుందని.. ఇప్పటి అనుబంధాలతో అర్థం చేసుకోవచ్చు.
హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..!