మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆషాఢమాసం ముగిసిన వెంటనే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ హైకమాండ్‌కు కూడా రూఢీగా తెలియడంతో.. ఆయనను ఆత్మకూర్ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించేసి.. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. ఆయన రంగంలోకి దిగిపోయారు. క్యాడర్‌ను సమీకరించుకుంటున్నారు. కానీ ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం వైసీపీలో ఎక్కడ టిక్కెట్ ఇస్తారన్నదానిపై క్లారిటీ రాలేదు. తన స్థానం ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతం రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేకపాటి కుటుంబీకులను తప్పించి.. ఆ టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదని.. జగన్ కూడా ఆనంకు చెప్పారని వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయి. వెంకటగిరి టిక్కెట్ పై ఆనంకు హామీ లభించినట్లు చెప్పుకొచ్చాయి.
ఇది నిజమేననుకునేలోపలే.. జగన్మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు.. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. బీజేపీలో ఉన్న ఆయన… వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేయడానికి .. తన తండ్రి వర్గాన్ని మొత్తానికి ఏకతాటిపైకి తెచ్చేందుకు చాలా రోజులుగా కసరత్తు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రధాన పార్టీ అయిన వైసీపీ తరపున పోటీ చేస్తే.. గట్టి పోటీ ఇవ్వొచ్చని..రాంకుమార్ రెడ్డి భావిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి వైసీపీలో చేరి.. ఆ పార్టీ టిక్కెట్ పై పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆయన పాదయాత్రలో జగన్‌ను కలిసి.. మాట్లాడుకున్నారు.
వాస్తవానికి వెంకటగిరి నుంచి వైసీపీ తరపున పోటీ చేయడానికి జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అనే నేతతో పాటు… మరో ఇద్దరు, ముగ్గురు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనం పార్టీలో చేరితే వారందర్నీ జగన్ ఏదో విధంగా బుజ్జగిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుు.. నేరుగా రాంకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. అంటే ఆనంకు అక్కడా కూడా టిక్కెట్ ఖరారు కాలేదని డిసైడయినట్లయింది. నేదురుమల్లి వారసుడ్ని జగన్ పార్టీలో చేర్చుకుంటున్న విషయం తెలిసి.. ఆనం వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. ఆనం రాజకీయ భవిష్యత్ రిస్క్‌లో పెట్టుకుంటున్నారని ఫీలవుతున్నారు.