టీడీపీ, జనసేన , బీజేపీ పొత్తులు ఖరారు అయ్యాయి. అభ్యర్థులను కూడా దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. పవన ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఢిల్లీ నుంచి జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్రంలో గట్టి ప్రతినిధి ఉండాలని ఈ మేరకు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేరు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డే.. ఏపీకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకోవాలి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు ఉండటం ఆనవాయితీ. అయితే ఈ సారి ఏపీ నుంచి ప్రభుత్వంలో చేరే మంత్రులు ఎవరూ లేరు. బీజేపీ నాయకత్వం కూడా తమ పార్టీ నేతలకు ఎవరిరైనా రాజ్యసభ ఇచ్చి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు.
ఈ సారి కేంద్రంలో ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉండే అవకాశం ఉంది. ప్రతీ సారి నిర్లక్ష్యం చేయలేరు. ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగుతున్నందున పార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ క్రమంలో పవన్ నే కేంద్ర మంత్రిగా తీసుకుంటే… బ్యాలెన్స్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. పవన్ కు ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తే గౌరవించినట్లు ఉండటమే కాకుండా.. రాష్ట్రం కోసం ఢిల్లీలో పనులు చక్కబెట్టే పవర్ ఫుల్ లీడర్ గా కూడా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి.
అయితే పవన్ కల్యాణ్‌కు ఇప్పటి వరకూ ఎంపీగా పోటీ చేయాలన్నఆలోచన లేదు. అనకాపల్లి నుంచి ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించింది. ఆయన ఇల్లుకూడా తీుకుని రంగంలోకి దిగారు. ఎందుకో కానీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పవన్ అక్కడ్నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. పవన్ కల్యాణ్..బీజేపీ నేతల సూచనలకు పాటిస్తే.. ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు.