తెలంగాణలో గత పదేళ్లలో చెరువుల్ని పూర్తిగా ఆక్రమించిన వైనాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల ముందు ఉంచారు. సుదీర్ఘంగా ఉన్న ఆ రిపోర్టులో ప్రతి అంశాన్ని స్పష్టంగా మ్యాపులతో సహా వివరించారు. పదేళ్ల కిందట అక్కడ ఉన్న వాటర్ బాడీస్.. ఇప్పుడు ఉన్న హైరైజ్ అపార్టుమెంట్లను చూస్తే సామాన్య జనం కూడా ఇన్ని ఘోరాలు ఎలా జరిగిపోయాయని ఆశ్చర్యపోక తప్పదు. కట్టేసి అమ్మేసుకుని అసలు చెరువులే లేకుండా చేసినవి కూడా కళ్ల ముందు ఉంచారు.
ప్రస్తుతం అత్యంత లగ్జరీ, ఖరీదైన ప్రాజెక్టులుగా పేరున్నవి కూడా వాటర్ బాడీస్లోనే కడుతున్నారు. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న వాటిలో అత్యంత ఖరీదైనదిగా చెప్పుకునే కాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ప్రాజెక్టు వంద శాతం రిస్క్ లో ఉంది. వెర్టెక్స్ విరాట్, సుమధుర రాయలే, సైబర్ సిటి ఓరియానా, ఎస్ఎమ్ఆర్ వినయ్ బౌల్డర్ ఉడ్స్, వజ్రం క్సోరా వంటి ప్రాజెక్టులన్నీ ఆక్రమిత స్థలాల్లోనే ఉన్నాయని తేల్చారు. ప్రత్యేకంగా రిపోర్టులో ప్రాజెక్టుల గురించి చెప్పలేదు కానీ.. అక్కడ ఆక్రమణకు గురయ్యాయని చెప్పడం ద్వారా ఆ ప్రాజెక్టులు రిస్క్‌లో ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు వాటిపై హైడ్రా ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కూల్చలేనంతగా నిర్మాణం జరిగిపోయిది. అంతకు మించి ఆ ప్రాజెక్టులన్నింటికీ సర్వ అనుమతులు వచ్చాయి. హెచ్ఎండీఏ, రెరా కూడా అనుమతులు ఇచ్చాయి. బ్యాంకులు అప్రూవ్ చేశాయి. అంటే ప్రభుత్వం వాటిని పూర్తిగా చట్టబద్ధం అని సర్టిఫై చేసింది. ఇప్పుడు చట్ట విరుద్ధం అని మళ్లీ యూటర్న్ తీసుకుంటే.. దానికి అయ్యే నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం. పాలకులు ఎవరైనా చట్టాలు ఒకటే. గత ప్రభుత్వంలో వచ్చిన అనుమతులు అక్రమం.. ఈ ప్రభుత్వం దాన్ని నేల మట్టం చేయలేదు. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ రిస్క్ లో ఉండవచ్చు కానీ..దానికి పరిష్కార మార్గాన్ని కూడా ప్రభుత్వమే చూపించాల్సి ఉంది.