హైదరాబాద్ మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్. ఎందుకంటే అమ్మకాలు అలా ఉంటాయి. అదే మరుమూల ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు డిమాండ్ ఏం ఉంటుంది..?. కానీ తెలంగాణలో ప్రస్తుతం మద్యం దుకాణాల కోసం జరుగుతున్న ప్రక్రియలో ఏపీ సరిహద్దుల్లో ఉన్న మరుమూల మద్యం దుకాణాలకే పుల్ డిమాండ్ . అలా ఇలా కాదు.. వందల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఒక్కో ధరఖాస్తు రెండు లక్షలు. మళ్లీ తిరిగి ఇవ్వరు. అయినా సరే వందల్లో ధరఖాస్తులు పెట్టుకున్నారు.
ఇటు ఖమ్మం, నల్లగొండ, అటు కర్నూలు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో మద్యం దుకాణాలకు భారీగా ధరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలోని మద్యం దుకాణానికి 118 దరఖాస్తులు దాఖలయ్యాయి. మధిరలోని రాజుపాలెం మద్యం దుకాణానికి 117 దరఖాస్తులు, ఎర్రుపాలెంలోని 77 నెంబర్ దుకాణానికి 116 దరఖాస్తులు వచ్చాయి. రావడం విశేషం. కర్నూల్ సరిహద్దులోని జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్, ఉండవల్లి మద్యం దుకాణాలకు కూడా ఎక్కువగా టెండర్లు దాఖలయ్యాయి. తెలంగాణలో ఇంకెక్కడా ఇంత మంది పోటీ పడటం లేదు.
దీనికి కారణం మిగతా మద్యం దుకాణాలతో పోలిస్తే వీటి టర్నోవర్ చాలా ఎక్కువగా ఉంది. ఏపీకి వాటి నుంచి పెద్దఎత్తున మద్యం సరఫరా జరగుతోంది. ఏపీలో ఊరు, పేరు లేని బ్రాండ్ల మద్యాన్ని అమ్ముతున్నారు. రేటు కూడా చాలా ఎక్కువ. దీంతో తెలంగాణ గ్రామాల మద్యం షాపుల నుంచి స్టాక్ ఏపీలోకి వెళ్తోంది. దీంతో వారి ఆదాయం రెట్టింపు అయింది. కర్నూలుకు సరిహద్దుల్లో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి గ్రామంలో మద్యం దుకాణంలో రెండు సంవత్సరాల్లోనే రూ.64 కోట్ల అమ్మకాలు జరిగాయి. అదే హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఉండే దుకాణాల్లో రూ.35 కోట్లలోపే మద్యం అమ్ముడైంది. అంటే ఏపీ ఆదాయం… తెలంగాణకు వెళ్తోందన్నమాట.