తెలంగాణ ఉద్యోగులకు ఈ నెల నుంచి పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన అందరికీ పూర్తి జీతం అందేలా బిల్లులు పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం.. విపత్తు సమయాల్లో జీతాలు కత్తిరించే అవకాశాన్ని కల్పించుకుంటూ.. ఎవరూ ప్రశ్నించకుండా.. ఓ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. దాంతో.. ఈ నెల కూడా సగం జీతమే ఇస్తారన్న ఊహాగానాలు నడిచాయి.
అయితే… గత మూడు నెలలుగా.. కట్ చేసిన సగం జీతాన్ని మళ్లీ అడిగే అవకాశం లేకుండా.. ఆ ఆర్డినెన్స్ తెచ్చినట్లుగా భావిస్తున్నారు. కత్తిరించిన జీతం మళ్లీ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగ సంఘాలు అడగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం ఈ నెల నుంచి అయినా పూర్తి స్తాయి జీతం… పెన్షన్లు ఇస్తామన్నందుకు ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల కత్తిరించినా అడిగే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. ఉద్యోగ సంఘాల నేతలు.. నోరు తెరిచే పరిస్థితి లేదు.
మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత … దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలను కత్తిరించడం లేదు. భారీ లోటుతో ఆర్థిక రథాన్ని లాగుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా.. గత నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం జీతం చెల్లించారు. కానీ కేసీఆర్ మాత్రం… మద్యం అమ్మకాలు కూడా ఆదుకోలేదన్న కారణంగా…. గత నెలలో జీతం సగమే చెల్లించారు. ఈ నెల నుంచి ఆ బాధ లేకుండా పోయింది.