ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… తాను ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేయడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థ ఉండాలని అంచనాకు వచ్చారు. ఆ ప్రత్యేక వ్యవస్థ…ఓ మంత్రిత్వ శాఖనా..? లేక.. అధికారుల బృందమా..? అన్నదానిపై… చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
నవరత్నాల హామీలు ప్రజల మనసుల్లోకి వెళ్లాయని.. అందుకే ఇంత భారీ విజయమని.. జగన్ నమ్ముతున్నారు. వీటి అమలు కోసం ప్రత్యేకంగా కొంతమంది అధికారులను నియమించటంతోపాటు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతోపాటు నవరత్నాల ఫలితాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థ పనిచేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు. అందుకు సమర్థులైన అధికారులను ఇందుకోసం నియమించుకోవాలని చూస్తున్నారు. కుదిరితే ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తే ఎలా ఉటుందన్న చర్చ కూడా నడుస్తోంది. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలను ఏటా 25 శాతం వరకు తగ్గించటం వంటి అంశాలపై ఇప్పటికే తగిన నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత ఆయా శాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలనుసారం ఆయా శాఖలు కసరత్తు ప్రారంభించాయి. 2024 నాటికి సంపూర్ణ మద్య నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించింది.
అసెంబ్లీ సమావేశాల్లోపు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. 8వ తేదీ సచివాలయంలోని తన చాంబర్ లోకి జగన్ అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటల సమయంలో సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో నూతన మంత్రివర్గంతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత 10వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కీలక శాఖలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగింపు, రాజధాని నిర్మాణాలపై స్పష్టత, టెండర్ల ఆమోదం కోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ వంటి అంశాలపై కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. స్పీకర్ ఎన్నికపై… జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనుభవం ఆధారంగా నిర్మయం తీసుకోబోతున్నారు. బొత్స పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. కేబినెట్ కూర్పు, సామాజిక సమీకరణలు, పార్టీపట్ల అంకిత భావం, తనపట్ల విధేయత ఉన్నవారిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.