ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలకు ఫుల్ టైం కేటాయించారు. ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అమ్మకాలు ఉంటాయి. ఇప్పటి వరకూ ఆంక్షల కారణంగా ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్డెక్కినా ప్రజలు చితకబాదారు. ఇప్పుడు… మద్యం మెడిసిన్ కోసం వెళ్తున్నామని చెబితే చాలు వదిలి పెట్టేస్తారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయలేదు. జోన్ల వారీగా ఆంక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో… ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. దాని కోసం ఎక్సైజ్ అధికారులు రెండు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మందు బాబులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు.
ఇప్పటి వరకూ కోల్పోయిన ఆదాయాన్ని రేట్ల పెంపు ద్వారా తెచ్చుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. రూ. 4,400 కోట్ల ఆదాయం వచ్చేలా 25 శాతం ధరలు పెంచారు. వాస్తవానికి ప్రతీ ఏటా 20 శాతం దుకాణాలు తగ్గిస్తామని అందుకే.. ధరలు పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. ఈ సారి దుకాణాలు తగ్గించలేదు. కానీ రేట్లు పెంచారు. దుకాణాల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వం అధికారులకు సూచనలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే మద్యం దుకాణాలు తెరుస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
రెడ్ జోన్లలో కూడా మద్యం కూడా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. రెడ్ జోన్ జిల్లాలో ప్రత్యేకంగా కేసులు నమోదైన చోట్ల కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతాల్లో మాత్రం అమ్మకాలు ఉండవు. నలభై రోజులుగా మద్యం దుకాణాలు లేవు. దీంతో ఒక్క సారిగా వాటి కోసం మందుబాబులు ఎగబడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరుస్తారా అని మందుబాబులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా షాపులను మళ్లీ ఎప్పుడైనా మూసేయొచ్చుననే సందేహం ఉంది. దీంతో షాపులు తీసిన వెంటనే కొన్ని రోజులకు సరిపడా మద్యాన్ని నిల్వ చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.