కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి వచ్చే దారులన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. స్కూల్, కాలేజ్ బస్సులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి.
శ్రీరామనవమి తర్వాత దశమి నుంచి చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రతి ఏటా వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.శుక్రవారం సంతాన ప్రాప్తి దివ్యఔషధం పంపిణీ చేయనుండటంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సంతానం లేని వారు ఈ ఔషధాన్ని తీసుకుంటే పిల్లలు పుడుతారని నమ్మకం. ఈమేరకు ఆలయ అధికారులు గరుడ ప్రసాదం పంపిణీపై విస్తృత ప్రచారం కూడా చేశారు. దీంతో చాలామంది ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి రావడంతో ఆలయ సమీపంలో ట్రాఫిక్ రద్దీ భారీగా నెలకొంది. కాగా, బాలాజీని దర్శించుకుంటే వీసా తొందరగా వస్తుందని నమ్మకంతో చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా ఉంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే యువత కూడా ఈ బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చినట్లు తెలుస్తోంది.
బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు వేల మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. కానీ అంచనా వేసిన దానికంటే పదిరేట్లకు మించి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని… ప్రస్తుతం దేవాలయం రోడ్లలో ఎవరూ రావొద్దని ఆలయ అధికారులు కోరారు.